27 సిక్సర్లు, 30 ఫోర్లతో 344 పరుగులు.. దెబ్బకు ప్రపంచ రికార్డ్ ఖతం

టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో జింబాబ్వే జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.


ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌ (ICC Men’s T20 World Cup Sub-Regional Africa Qualifier) గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే ఈ అద్భుత ఘనతను సాధించింది.

120 బంతుల్లో 344 పరుగులు..

నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 344 పరుగులు చేసింది. అంతకుముందు 2023లో మంగోలియాపై నేపాల్ చేసిన 3 వికెట్లకు 314 పరుగుల రికార్డును జింబాబ్వే బద్దలు కొట్టింది.

సికిందర్ రజా ఊచకోత..

జింబాబ్వే బ్యాటింగ్ ప్రదర్శనలో కెప్టెన్ సికిందర్ రజా (Sikandar Raza) మెరుపు ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి గాంబియా బౌలర్లకు చుక్కలు చూపించిన రజా, కేవలం 43 బంతుల్లో 133 పరుగులు (నాటౌట్) చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా, రజా కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పురుషుల టీ20ఐ క్రికెట్‌లో జాయింట్-సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచింది. ఈ సెంచరీతో అతను టీ20ఐలలో సెంచరీ చేసిన తొలి జింబాబ్వే ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు.

ఓపెనర్ల శుభారంభం, మదాండే మెరుపు ఇన్నింగ్స్..

ఓపెనర్లు తాడివానాషే మారుమణి (Tadiwanashe Marumani), బ్రియన్ బెన్నెట్ (Brian Bennett) జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. మారుమణి కేవలం 19 బంతుల్లో 62 పరుగులు చేయగా, బెన్నెట్ 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ క్లైవ్ మదాండే (Clive Madande) కూడా విజృంభించి కేవలం 17 బంతుల్లో 53 పరుగులు (నాటౌట్) చేసి జట్టు భారీ స్కోరుకు తోడ్పడ్డాడు.

మరో రెండు ప్రపంచ రికార్డులు..

జింబాబ్వే ఇన్నింగ్స్‌లో మొత్తం 27 సిక్సర్లు నమోదయ్యాయి. ఇది కూడా టీ20ఐ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు.

345 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గాంబియా జట్టు 14.4 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇది కూడా టీ20ఐ క్రికెట్‌లో పరుగుల పరంగా అత్యధిక విజయ మార్జిన్ రికార్డును నెలకొల్పింది.

జింబాబ్వే ఆటగాళ్లు ప్రదర్శించిన ఈ ఉగ్రరూపం టీ20 క్రికెట్ చరిత్రలో ఒక మరపురాని ఘట్టంగా నిలిచింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.