ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్‌

www.mannamweb.com


మధ్యంతర భృతి ప్రకటించిన రాష్ట్ర సర్కారు

2023 అక్టోబరు 1 నుంచి వర్తింపు

ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అమలు

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లోని రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు నర్కారు తీపి కబురు చెప్పింది.

వారి మూలవేతనంపై 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్‌)ని వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేసిన విధంగానే 2023 అక్టోబరు 1 నుంచే ప్రభుత్వ రంగం సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఐఆర్‌ వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి సుమారు 60వేల మందికి లబ్ధి చేకూరనుంది.

నిజానికి, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రెండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) వేతనాలు అందాల్సి ఉంది. కానీ, పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ప్రకటించని ప్రభుత్వం 2023 అక్టోబరు1 నుంచి వారి మూలవేతనంపై 5 శాతం మధ్యంతర భృతిని అమల్లోకి తెచ్చి ఉద్యోగులను శాంతపరిచింది. 2020 నాటి పీఆర్సీ వేతనాలు పొందుతున్న వారందరూ ఈ ఐఆర్‌కు అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐఆర్‌ 5 శాతానికి మించి చెల్లించకూడదని, ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతుల ఆధారంగా కాస్త తగ్గించుకుని కూడా ఇచ్చుకోవచ్చని తెలిపింది. 2020 నాటి పీఆర్సీ పెన్షన్లు పొందుతున్న కార్పొరేషన్లు, సొసైటీల పెన్షనర్లకు కూడా ఈ ఐఆర్‌ వర్తిస్తుందని తెలిపింది. కాగా, మధ్యంతర ప్రకటనపై టీపీఎ్‌సఈఎఫ్‌ హర్షం వ్యక్తం చేసింది. గత సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోలేదని, ప్రస్తుత ప్రభుత్వం తమను ఆదరించడం ఆనందంగా ఉందంటూ టీపీఎ్‌సఈఎఫ్‌ చైర్మన్‌ బాలకృష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గవ్వ రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ జీటీ జీవన్‌ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.