చలికాలంలో దుస్తులు ఆరవేయడం కాస్త ఇబ్బందితో కూడిన విషయమే. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు, అధిక తేమ, తక్కువ సూర్యరశ్మి కారణంగా డ్రెస్లు ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
సరిగ్గా ఆరకుంటే దుర్వాసన వస్తూ అసౌకర్యంగా ఉంటుంది. కానీ కొన్ని ఉపాయాలు, ఇంటి చిట్కాలు ఫాలో అయితే.. మీరు శీతాకాలంలో కూడా బట్టలు త్వరగా ఆరబెట్టుకోవచ్చు. బట్టలు ఆరబెట్టే విధానాన్ని సర్దుబాటు చేయడం నుంచి.. సాధారణ వస్తువులను సృజనాత్మక మార్గాల్లో ఉపయోగించడం వరకు.. ఆరు చిట్కాలు ఫాలో అయితే చలికాలంలో కూడా ఈజీగా దుస్తులు ఆరబెట్టుకోవచ్చు.
స్పిన్ డ్రైయర్
చాలా మంది వాషింగ్ మిషన్లో స్పిన్నింగ్ శక్తిని తక్కువ అంచనా వేస్తారు. ఉతికిన తర్వాత అదనపు స్పిన్ సైకిల్ లేదా స్పిన్ డ్రైయర్ ఉపయోగించడం వల్ల మీ బట్టల నుంచి ఎక్కువ శాతంలో నీరు తొలగిపోతుంది. ఇది ఆరబెట్టే సమయాన్ని గంటల కొద్దీ తగ్గిస్తుంది. స్వెటర్లు, తువ్వాళ్లు, జీన్స్ వంటి బరువైన వస్తువులు ఆరబెట్టడానికి సులభమైన మార్గం ఇది. దీనివల్ల బయట ఆరబెట్టే సమయం తగ్గడమే కాకుండా.. తేమ, వాసనలు రాకుండా నిరోధిస్తాయి.
ఇంట్లోనే ఆరేస్తే..
మీకు డ్రెస్లు ఇంటిబయట ఆరవేయలేని పరిస్థితి ఉంటే.. ఇంట్లోకి సహజంగా సూర్యకాంతి లేదా వెచ్చని గాలి వచ్చే ప్రదేశాల్లో ఆరవేయవచ్చు. కిటికీల దగ్గర లేదా వెంట్ల కింద ఆరబెట్టే రాక్లు ఉంచండి. గుంపుగా వేలాడదీయకుండా గ్యాప్ ఉండేలా.. గాలి ప్రసరణ వెళ్లేలా ఆరేసుకోవాలి. దీనివల్ల ప్రతి భాగం సమానంగా ఆరుతుంది. కోట్లు లేదా దుప్పట్లు వంటి బరువైన వాటిని విడిగా, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో వేసుకోవాలి.
హెయిర్ డ్రైయర్
త్వరగా ఆరిపోవాలనుకునే డ్రెస్ల కోసం హెయిర్ డ్రైయర్ ఉపయోగించవచ్చు. ఇది ఒక లైఫ్సేవర్. కాలర్లు, కఫ్లు వంటి తడి ప్రదేశాలపై దృష్టి పెట్టండి. ఫ్యాబ్రిక్లకు నష్టం జరగకుండా, వేడెక్కకుండా ఉండటానికి సురక్షితమైన దూరంంలో ఉంచి డ్రైయర్ను మధ్యస్థ వేడిలో ఉంచి డ్రై చేసుకోండి. అదనంగా హెయిర్ డ్రైయర్లు మడతలు నుంచి తేమను తొలగించి దుర్వాసన రాకుండా సహాయపడతాయి.
టవల్ రోల్ చిట్కా
అధిక తేమను తీసేయడానికి పొడి టవల్ ఉపయోగించడం ఒక క్లాసిక్ చిట్కా. మీ తడి దుస్తులను చదునుగా ఉంచండి. పైన పొడి టవల్ ఉంచండి. సుషీ రోల్ లాగా చుట్టండి. టవల్ వీలైనంత ఎక్కువ నీటిని పీల్చుకునేలా చుట్టేటప్పుడు గట్టిగా నొక్కండి. ఈ పద్ధతి స్వెటర్లు, సున్నితమైన దుస్తులు, బరువైన వాటికి బాగా పనిచేస్తుంది. విప్పిన తర్వాత వెంటనే ఆరబెట్టండి. ఈ చిట్కా ఆరబెట్టడాన్ని వేగవంతం చేయడమే కాకుండా.. ఎక్కువ కాలం వేలాడదీయడం వల్ల కలిగే సాగదీయడం, ముడుచుకోవడం వంటివాటిని నివారిస్తుంది.
డీహ్యూమిడిఫైయర్ లేదా హీటర్
శీతాకాలపు గాలి తరచుగా తేమగా ఉంటుంది. ఇది డ్రెస్ల్లు ఆరే సమయాన్ని పెంచుతుంది. కాబట్టి మీ లాండ్రీ ఏరియాలో డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించడం వల్ల గాలిలోని అదనపు తేమ తొలగిపోతుంది. ఇది మీ బట్టలు త్వరగా ఆరిపోయేలా చేస్తుంది. బూజు, దుర్వాసన వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డీహ్యూమిడిఫైయర్ లేకపోతే సురక్షితమైన హీటర్ లేదా రేడియేటర్ దగ్గర బట్టలు ఉంచండి. వెచ్చని గాలి ప్రసరణ తేమను తగ్గిస్తుంది. ఫాబ్రిక్ నష్టం లేదా అగ్ని ప్రమాదాలను నివారించడానికి సురక్షితమైన దూరంలో హీటర్ ఉంచాలి.
ఐస్ క్యూబ్ ఆవిరి చిట్కా
క్రేజీ ఎఫెక్టివ్ చిట్కా ఏంటంటే.. డ్రైయర్లో ఐస్ క్యూబ్లను ఉపయోగించడం. ఇది ఆవిరిని ఇస్తుంది. దీనివల్ల డ్రెస్లు త్వరగా ఆరుతాయి. అలాగే ముడతలు తగ్గుతాయి. తడి దుస్తులను కొన్ని ఐస్ క్యూబ్లతో డ్రైయర్లో ఉంచండి. ఐస్ కరిగినప్పుడు.. అది ఫాబ్రిక్లోకి చొచ్చుకుపోయే ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. ఇది త్వరగా ఆరిపోవడానికి, మృదువుగా రావడానికి సహాయపడుతుంది. ఈ ట్రిక్ ఉన్ని, కాటన్ షర్టులకు చాలా బాగా పనిచేస్తుంది.
ఈ చిట్కాలన్నీ దుస్తులు వేగంగా ఆరడానికి హెల్ప్ చేసేవే. మీరు వీటిని కేవలం చలికాలంలోనే కాదు వర్షాకాలంలో కూడా ఫాలో అవ్వవచ్చు.



































