మార్వాడీలు…వ్యాపారానికి పర్యాయపదం… ఎప్పుడో 16 శతాబ్దం నుండి వ్యాపారం చేసిన అనుభవం వీరి సొంతం. అందుకే మార్వాడీలు సహజంగా వ్యాపారం చెయ్యటానికే మొగ్గు చూపుతారు.
ఉద్యోగం చేసే మార్వాడీలు ఉండరని కాదు కానీ, ఒకవేళ చేసినా, వారు ఫైనాన్స్ కు సంబంధించిన ఉద్యోగాల్లోనే ఉంటారు. హార్డ్వేర్ మొదలుకుని వారు చెయ్యని వ్యాపారం ఉండదేమో అనిపిస్తుంది. ఇలా చిన్న వ్యాపారాలే కాదు… ఇండియాలో అతిపెద్ద కంపెనీలైన డీమార్ట్, ఓలా, బిర్లా లాంటి ఎన్నో వ్యాపార సామ్రాజ్యాలు మార్వాడీలవే. భారతదేశం లో ఉన్న బిలియనీర్లలో ఒక వంతు మంది మార్వాడీలే ఉంటారు. మార్వాడీలకు వ్యాపారం అనేది తరతరాలుగా వస్తున్న వారసత్వ విద్య. మీరు కొత్తగా వ్యాపారం లోకి వస్తున్నట్లయితే ఏ MBA కాలేజీలోని నేర్పని బిజినెస్ పాఠాలు వారిని చూసి నేర్చుకోవచ్చు. అవేంటో ఈ 7 పాయింట్లలో తెలుసుకోండి…
1.రిస్క్ తీసుకోవడమే విజయ రహస్యం
మార్వాడీలు ఏదైనా వ్యాపారం చెయ్యాలంటే దాంట్లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు. ఏదైనా కొత్త బిజినెస్ లేదా టెక్నాలజీ ఏదైనా సరే వీరు దాంట్లో డబ్బు ఉంది అంటే రిస్క్ తీసుకుని పెట్టుబడి పెడతారు. నో రిస్క్ నో రస్క్ స్ట్రాటజీ వీరిది. అందుకే ఏదైనా కొత్త వ్యాపారం మొదలవుతుందంటే ముందే దాంట్లో ఎంటర్ అయిపోతారు. ఎందుకంటే కాంపిటీషన్ లేనప్పుడే రంగంలోకి దూకేస్తే రూల్ చెయ్యొచ్చు అనే సిద్ధాంతం వీరిది. సో వ్యాపారం మీ లక్షమయితే మీరు నేర్చుకోవాలిసిన మొదటి విషయం ఇదే. అలా అని సరైన రీసెర్చ్ లేకుండా మాత్రం ఎంటర్ అయితే మీరు మార్వాడీ అవ్వరు సరికదా, కొత్త సమస్యల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త.
2.ఖర్చుని అదుపులో పెడితే అదే లాభం
మార్వాడీ బిజినెస్ ఓ అతి ముఖ్యమైనది ఇది. మార్వాడీ అనవసరం గా ఖర్చుపెట్టడు. కేవలం అవసరం అయితేనే ఖర్చు పెడతాడు. ఖర్చు తగ్గించడం అంటే లాభం తీసుకోవడం అని నమ్ముతాడు. ఇప్పుడు ఒక మార్వాడీ సూపర్ మార్కెట్ నడిపితే దాంట్లో AC పెట్టటం కంటే ఆ ఖర్చు ను తగ్గించి తన వస్తువుని పోటీ రేటుకి అమ్మటం పై దృష్టిపెడతాడు. దానివల్ల మార్కెట్ కంటే తక్కువ రేట్ కి దాన్ని అమ్మగలడు. మనం డీమార్ట్ షాప్ ను చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. ఇక్కడ మీరు నేర్చుకోవాలిసిన విషయం అనవసర ఖర్చు తగ్గించడం అంటే లాభం సంపాదించడం.
3.కుటుంబమే బలం
మార్వాడీ లు ఎప్పుడూ కుటుంబ సభ్యులనే వ్యాపారంలో భాగస్వాములను చేసుకుంటారు. ముందు ఒక వ్యక్తి వ్యాపారం మొదలుపెడతాడు అక్కడ నిలబడ్డ తరువాత అన్న, తమ్ముడు ఇలా అందరిని ఆ వ్యాపారం లో భాగం చేసుకుంటాడు. తరువాత మరిన్ని ప్రాంతాల్లో ప్రారంభించి మార్కెట్ ను గుప్పిట్లో తీసుకుంటారు. సాధారణం వీరు బయట వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యరు.17 ఏళ్ళు రాగానే పిల్లలు కూడా వ్యాపారంలో మెళుకువలు నేర్చుకోవాల్సిందే. అందుకే మార్వాడీ లు చదువుపై పెద్దగా దృష్ఠి పెట్టరు. తమ వ్యాపారాలే తమ పిల్లలకు MBA కాలేజీలు. మీరు కూడా వ్యాపారం చెయ్యాలంటే భాగస్వాములకంటే ఫ్యామిలీని భాగం చేసుకోండి.
4.ధనమే అన్నిటికి మూలం
మార్వాడీలు డబ్బుని ప్రేమిస్తారు. తమ పిల్లలకు అదే నేర్పిస్తారు. ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వరు. డబ్బు పెట్టుబడి పెడితే అది ఇంకో రూపాయి తీసుకురావాలనే ఆలోచనలో ఉంటారు. పెద్దగా డబ్బు వెదజల్లి వ్యాపారం చెయ్యటం కాదు, ఒక పద్ధతి ప్రకారం డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బు సంపాదించడం, ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేసి మరింత డబ్బుని సంపాదించడం. ఇదొక నిరంతర ప్రక్రియ. మీరు డబ్బు సంపాదించాలంటే చెయ్యవలిసిన ముఖ్యమైన పని ఇన్వెస్ట్ చెయ్యటం దాని నుండి వచ్చిన లాభాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చెయ్యటం.
5.ట్రెండ్ ఈజ్ నాట్ యువర్ ఫ్రెండ్
మార్వాడీ ట్రెండ్ ను పట్టుకుని పరుగుపెట్టరు. తాము వేచి చూసి ముందుగా ఎంటర్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేస్తారు. అందరు చేసే వ్యాపారాలకంటే ముందుగాని వారు ఆలోచిస్తారు. మీరు సరిగా చూస్తే నగరాల్లో ముందు వారు ఒక ప్రాంతం డెవలప్ కానప్పుడే శివార్లలో వచ్చి స్థలాలు కొని పెట్టుకుంటారు. కొన్నాళ్ళకు ఆ ఏరియా లో అభివృద్ధి ప్రారంభం అయ్యాక అక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్, గ్రానైట్, స్టీల్, సిమెంట్ లాంటి వ్యాపారాలు మొదలు పెడతారు. హైదరాబాద్ లో ఎక్కువ శివారు ప్రాంతాలు చూస్తే మీకు వారి బిజినెస్ స్ట్రాటజీ అర్థం అవుతుంది. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ వీరిది.
6.భాద్యతలు అప్పగించడం
మార్వాడీలు ఎన్ని వ్యాపారాలు చేసిన వారు బాధ్యతలను సరిగా అప్పజెప్పగలరు. కానీ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇవ్వరు. వారి దగ్గర పని చేసే ఉద్యోగులు కూడా సహజంగా కుటుంబ సభ్యులే అయినాకూడా ఒక్కొక్కసారి బయట ఉద్యోగులును కూడా పెట్టుకుంటారు. కానీ వారికి బాధ్యతలు ఇచ్చినా కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు. వారి పై ఆధారపడరు. వారి దగ్గర నుండి నేర్చుకోవాలిసిన ముఖ్య లక్షణం ఇది. ఎవ్వరి మీద ఆధారపడకుండా పట్టు నిలబెట్టుకోవడం.
7.తమవారితో మంచి సంబంధాలు
మార్వాడీ తమ సాటి మార్వాడిని పూర్తిగా నమ్ముతాడు. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఇది వారికి పెద్ద ప్లస్ పాయింట్. అందుకే వారికి మనీ రొటేషన్ ఈజీ గా జరుగుతుంది. ఈజీ గా వారు చేసే వ్యాపారానికి మద్దతు దొరుకుతుంది. వ్యాపారులకు సరుకు క్రెడిట్ లో ఇస్తారు. ఇలా తోడుగా ఉంటారు. వ్యాపారం రంగంలో అడుగుపెట్టేవారు నేర్చుకోవాలిసిన ముఖ్యమైన విషయం పబ్లిక్ రిలేషన్స్. అది వీరిని చూసే నేర్చుకోవాలి.
ఒకప్పుడు బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులిచ్చే వారిగానే మార్వాడీలు ఎక్కువమందికి తెలుసు. ఇప్పుడు అలా కాదు వారు కిరాణా కొట్లు మొదలుకుని స్టీల్, గ్రానైట్ ఒకటేమిటి డబ్బు ఎక్కడుందో అన్ని రంగాల్లోనూ వారి వ్యాపారాలున్నాయి. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ కమ్యూనిటీ ఇప్పుడు ఎక్కడో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మారు మూల ప్రాంతాలకు కూడా వెళ్లి కూడా వ్యాపారాలు చేస్తున్నారు. వారి నుండి నేర్చుకోదగ్గ ఈ విషయాలను మీరు కూడా ఫాలో అయితే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడతాయి.
































