సంక్రాంతి సినిమాల అదనపు షోలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

www.mannamweb.com


సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి తెలుగు సినిమాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రామ్‌చరణ్‌ ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer) థియేటర్‌లో సందడి చేస్తుండగా, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) జనవరి 12న, వెంకటేశ్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) జనవరి 14న విడుదల కానున్నాయి.

ఈ క్రమంలో అదనపు షోలపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. హైకోర్టు తీర్పు ఆధారంగా ఈ మేరకు మెమో విడుదల చేసింది. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపు, అదనపు షోలకు సంబంధించి వివరణ ఇచ్చింది.

ఈ నెల 4న ఇచ్చిన మెమో కేవలం టికెట్ ధరలకు సంబంధించింది మాత్రమేనని స్పష్టం చేసింది. సరైన పోలీసు భద్రత లేకుండా థియేటర్లకు వచ్చే జనాన్ని నియంత్రించటం కష్టమని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటలకు అదనపు షోలకు అనుమతి నిరాకరించింది. ఉత్తర్వుల ప్రకారం 10 రోజుల పాటు రోజుకు 5 షోలకు మించకుండా ప్రదర్శించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు ప్రదర్శనల్లోనే ఒకటి బెనిఫిట్ షోగా నిర్వహించుకోవచ్చని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, నగర పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.

రివ్యూ: గేమ్‌ ఛేంజర్‌.. రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబో ఎలా ఉంది?
తాజాగా జారీ చేసిన మెమోతో ఇటు ‘గేమ్‌ ఛేంజర్‌’, అటు ‘డాకు మహారాజ్‌’తో పాటు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలకు ఉదయం 4గంటల షో ప్రదర్శించడానికి అనుమతి లేదు. అంటే ఆరో షో రద్దయినట్లే. జనవరి 12న విడుదల కానున్న ‘డాకు మహారాజ్‌’ ఏపీలో కొన్ని చోట్ల ఉదయం 4గంటల షోకు టికెట్లు బుక్‌మై షోలో అందుబాటులో ఉంచారు. మరి ఆ షోల పరిస్థితి ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకం. తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదు షోలను మాత్రమే ప్రదర్శించనున్నారు. తాజా నిర్ణయం సంక్రాంతి సినిమాల వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుందని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.