తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుపతికి కొత్తగా వందేభారత్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒక వందేభారత్ రైలు కొనసాగుతోంది.
ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు విజయవాడ నుంచి బెంగళూరు కు ఖరారు చేసిన వందేభారత్ తిరుపతి మీదుగా నడపాలని నిర్ణయించారు. దీని ద్వారా ఇక అయిదు గంటల్లోనే తిరుపతికి చేరుకునే వెసులుబాటు కలగనుంది. ఈ రైలు ప్రారంభ ముహూర్తం అధికారులు ఖరారు చేసారు.
విజయవాడ – బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ కు గతంలోనే ఆమోదం లభించింది. కానీ, ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. తాజాగా రైల్వే అధికారులు ఈ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 27 లేదా 30వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ రైలుకు ఇప్పటి కే నెంబర్ .. షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ వందే భారత్ రైలు (20711) కేవలం కేవలం అయిదు గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోనుంది. విజయవాడ – బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలు ప్రతిపాదనలు గత మే నెలలోనే సిద్ధం కాగా, ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం తొమ్మిది గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 8 బోగీలు, 7 AC చైర్‌కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కలిగిన బెంగళూరు ట్రెయిన్ తిరుపతి వెళ్లే భక్తులకూ ఉపయోగపడనుంది.
కాగా, విజయవాడ – బెంగళూరు ఈ వందే భారత్ ట్రైన్ మంగళవారం మినహా మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. విజయవాడలో తెల్లవారుజామున 5.15 గంటలకు బయలు దేరి తెనాలి, ఒంగోలు నెల్లూరు మీదుగా ఉదయం 9.45గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అదే విధంగా చిత్తూరు, కాట్పాడి జంక్షన్, కృష్ణరాజపురం మీదుగా బెంగళూరు (SMVT)కి మధ్యాహ్నం 2.15గంటలకు చేరుతుంది.
అంటే తిరుపతి వెళ్లే యాత్రికులు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి చేరుకోవచ్చు. అదే విధంగా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి కృష్ణరాజపురం, కాట్పాడి, జంక్షన్, చిత్తూరు మీదుగా సాయంత్రం 6.55గంటలకు తిరుపతి చేరుకుంటుంది. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా రాత్రి 11.45గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే తిరుపతికి వెళ్లే ప్రయాణీకులతో పాటుగా బెంగళూరు వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది.

































