ఇరాన్లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత రెండు వారాల నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
ఇంతలో ఇరాన్ రాజవంశీయుడు రెజా పహ్లవి కూడా భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఆయన మద్దతుదారులు, ప్రభుత్వ వ్యతిరేకులంతా రోడ్లపైకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. వాహనాలు తగలబెట్టడం.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో రణరంగంగా మారింది. నిరసనకారులను కంట్రోల్ చేయలేక భద్రతా దళాలు కూడా చేతులెత్తేశాయి. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పినట్లుగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఇరాన్ అంతటా భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇరాన్లో నాల్గో అతి పెద్ద నగరమైన కరాజ్ నగర్లో కూడా నిరసనలు ఉధృతం అయ్యాయి. పలు వాహనాలు మంటలు కాలిపోయాయి. ఇంకోవైపు స్టార్‌లింక్, జీపీఎస్ సిగ్నల్స్ పూర్తిగా స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో పాటు పలు నగరాలు అంధకారం అలుముకుంది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఖమేనీ వార్నింగ్..
ఇక ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ను తీవ్రంగా హెచ్చరించారు. చరిత్రలో నిరంకుశులు, అహంకార పాలకులు అత్యున్నత స్థాయిలో పతనమయ్యారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్లో వాషింగ్టన్ అశాంతిని సృష్టించిందని ఖమేనీ ఆరోపించారు. ఒకటే చెప్పదలుచుకున్నా.. అహంకారంతో పాలించే నాయకులు తప్పనిసరిగా పతనాన్ని ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చారు. ఫారో, నిమ్రోద్, మొహమ్మద్ రెజా (పహ్లవి) వంటి నిరంకుశులు, అహంకార పాలకులు, ఇతర పాలకులు తమ అహంకారంతో శిఖరాగ్రంలో ఉన్నప్పుడు పతనాన్ని చూశారని తెలుసుకోవాలని సూచించారు.
ట్రంప్ హెచ్చరికలు..
ఇరాన్లో నిరసనలు ప్రారంభం అయ్యాక ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ వరుస బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అధికారులు నిరసనకారులపై సైనిక శక్తిని ప్రయోగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు ఏదైనా చెడు చేస్తే మేము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు.
నిరసనలకు కారణం ఇదే..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చాలా సంవత్సరాలుగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడుగా అణు కార్యక్రమంతో ముడిపడి ఉన్న అమెరికా, యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయి. గత జూన్‌లో ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధంతో సహా ప్రాంతీయ ఉద్రిక్తతలతో ఆ ఒత్తిడి మరింత తీవ్రమయ్యాయి. దీంతో రాష్ట్ర వనరులన్నీ హరించుకుపోయాయి.
ఇక ఇటీవల కాలంలో ఇరానీ కరెన్సీ భారీగా పడిపోయింది. 2025లో అమెరికా డాలర్‌తో పోలిస్తే దాని విలువు దాదాపు సగానికి పడిపోయింది. అధికారిక గణాంకాలు ప్రకారం డిసెంబర్లోనే ద్రవ్యోల్బణం 42 శాతానికి మించిపోయింది. ముఖ్యంగా విదేశీ దిగుమతులపై ఆధారపడిన వ్యాపారాలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇంకోవైపు పెరుగుతున్న ధరలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. దీంతో ఆర్థిక సంక్షోభంతో కుటుంబాలు విలవిలాడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. తొలుత వ్యాపారులు నిరసనలకు దిగగా.. అనంతరం నెమ్మది నెమ్మదిగా విశ్వవిద్యాలయాలు… నగరాలకు నిరసనలు వ్యాప్తి చెంది తీవ్ర రూపం దాల్చాయి. ప్రస్తుతం పూర్తిగా పరిస్థితులు చేదాటిపోయాయి.


































