రోజుకు నాలుగు గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయపడుతున్నారా? అయితే ఈ సరికొత్త పరిశోధన మీకోసమే. గుడ్లు కేవలం ప్రోటీన్ మాత్రమే కాదని, మెదడు, కాలేయం, కంటి ఆరోగ్యానికి మేలు చేసే పవర్‌హౌస్ అని ప్రముఖ వైద్యులు వివరిస్తున్నారు.
చాలా కాలంగా గుడ్ల విషయంలో ఒక రకమైన అపోహ ఉంది. గుడ్లు ఎక్కువగా తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని, అది గుండె ఆరోగ్యానికి చేటు చేస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే, ఈ పాత వాదనలను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు అమెరికాకు చెందిన ప్రముఖ సర్జన్, వెల్నెస్ నిపుణులు డాక్టర్ దర్శన్ షా. ఆరోగ్యవంతులైన వ్యక్తులు రోజుకు నాలుగు గుడ్లు తిన్నా అది కొలెస్ట్రాల్ ముప్పు కాదని, నిజానికి అది ఒక ‘న్యూట్రిషనల్ అప్‌గ్రేడ్’ అని ఆయన వివరిస్తున్నారు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన పంచుకున్న విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గుడ్ల గురించి ఆధునిక మెటబాలిక్, కార్డియోవాస్కులర్ పరిశోధనలు పూర్తిగా భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తున్నాయని డాక్టర్ షా పేర్కొన్నారు.
మాంసం కంటే గుడ్డు ఎందుకు ప్రత్యేకం?
సాధారణంగా ప్రోటీన్ కోసం మనం మాంసంపై ఆధారపడతాం. కానీ, మాంసం కేవలం కండర కణజాలం మాత్రమే. అదే గుడ్డు విషయానికి వస్తే, ఒక జీవిని పూర్తిగా సృష్టించేందుకు కావాల్సిన పోషక విలువలన్నీ (Nutrient blueprint) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి.
“ప్రకృతిలో లభించే ఏ ఇతర ఆహారం కంటే కూడా గుడ్డులోని ప్రోటీన్‌కు అత్యధిక ‘బయోలాజికల్ వాల్యూ’ ఉంటుంది. అంటే మాంసం లేదా చేపల నుంచి వచ్చే ప్రోటీన్ కంటే, గుడ్డులోని ప్రోటీన్‌ను మన శరీరం చాలా వేగంగా, సమర్థవంతంగా గ్రహిస్తుంది” అని డాక్టర్ షా వివరించారు. దీనివల్ల శరీర కణాల మరమ్మతుకు, శక్తికి కావాల్సిన ముడి పదార్థాలు పుష్కలంగా అందుతాయి.
పచ్చసొన: అసలైన శక్తి నిలయం
చాలా మంది కొవ్వు పెరుగుతుందనే భయంతో గుడ్డులోని పచ్చసొనను (Yolk) పక్కన పడేస్తుంటారు. కానీ అసలైన పోషకాలు అక్కడే ఉన్నాయి. పచ్చసొనలో సహజమైన కొవ్వులు, ఫాస్ఫోలిపిడ్లు ఉంటాయి. దీనివల్ల గుడ్డులోని దాదాపు 65 శాతం భాగం నేరుగా శక్తిగా మారుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో గుడ్లను చేర్చుకున్న వారు నీరసం, అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా ఉండగలరని ఆయన తెలిపారు.
ఇక తెల్లసొన విషయానికి వస్తే, ఇందులో సూక్ష్మజీవులను అడ్డుకునే ‘యాంటీ మైక్రోబియల్’ సమ్మేళనాలు ఉంటాయి. గుడ్డును ఉడికించి తినడం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి మరింత మేలు చేస్తాయి.
మెదడుకు, కంటికి రక్షణ కవచం
గుడ్లలో ఉండే ‘కోలిన్’ (Choline) అనే పోషకం కాలేయం, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపు మందగించకుండా కాపాడటమే కాకుండా, దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి తగ్గకుండా చూస్తాయి. పచ్చసొనలో ఉండే విటమిన్ K2, A, D లు రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చర్మ సౌందర్యానికి కూడా ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
నేచురల్ పద్ధతుల్లో పెరిగే కోడి గుడ్లు (Pasture-raised) మరింత శ్రేష్ఠమైనవని, అయినప్పటికీ సాధారణ గుడ్లు కూడా మార్కెట్లో దొరికే ప్యాక్డ్ హెల్త్ ఫుడ్స్ కంటే ఎంతో మేలని డాక్టర్ షా స్పష్టం చేశారు.
గుడ్ల నుండి గరిష్ట ప్రయోజనం పొందాలంటే..
గుడ్లను ఎలా వండుకోవాలనే దానిపై కూడా డాక్టర్ కొన్ని సూచనలు చేశారు:
ఉల్లిపాయలతో కలిపి: గుడ్లను ఉల్లిపాయలతో కలిపి వండటం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోయే ప్రక్రియ (Detoxification) మెరుగుపడుతుంది.
మిరియాల పొడి, ఉప్పు: వీటిని చేర్చడం వల్ల గుడ్డులోని కెరోటినాయిడ్లను శరీరం బాగా గ్రహిస్తుంది.
హాఫ్ బాయిల్డ్: పచ్చసొనను మరీ గట్టిగా ఉడికించకుండా కొంచెం పల్చగా (Runny yolk) ఉంచితే, వేడికి నశించిపోయే సున్నితమైన పోషకాలు అలాగే ఉంటాయి.
“రోజుకు మూడు నుండి నాలుగు గుడ్లు తినడం అనేది అతి కాదు. ఇది హార్మోన్లు, మెదడు పనితీరు, కాలేయం, కంటి ఆరోగ్యానికి వేసే ఒక బలమైన పునాది” అని డాక్టర్ షా వివరించారు.


































