ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది.
మరో 20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం స్పెషల్ సీఎ్‌సలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, హెచ్వోడీలకు అత్యవసర మెమో జారీ చేశారు. ఈ నెల 21వ తేదీలోపు హెచ్వోడీలు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. అన్ని స్థాయిల్లో ఉద్యోగులకు 29 నాటికి డీపీసీ పూర్తి చేసి, 31 లోపు పదోన్నతుల జీవోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి ఏడాది ఇదే షెడ్యూల్ పాటించాలని స్పష్టం చేశారు.
దీంతో త్వరలోనే ఉద్యోగులందరికీ పదోన్నతులు లభించనున్నాయి. ఇకపై ప్రతి ఏటా ఈ షెడ్యూల్ ప్రకారమే అర్హత కలిగిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ కచ్చితంగా పదోన్నతులు కల్పించనున్నారు. ”ఈ నెల 21 నాటికి పదోన్నతులకు సంబంధించిన ప్రతిపాదనలను హెచ్వోడీలు సచివాలయానికి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత 23వ తేదీ నాటికి సచివాలయంలోని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను సాధారణ పరిపాలన డిపార్ట్మెంట్కి పంపిస్తాయి. 29 నాటికి సాధారణ పరిపాలన శాఖ డీపీసీ పూర్తి చేసి, సంబంధిత మినిట్స్‌ను ఆయా సెక్రటరీలకు పంపించాలి. 31న సెక్రటరీలు పదోన్నతులకు సంబంధించిన జీవోలు జారీ చేయాలి” అని మెమోలో విజయానంద్ పేర్కొన్నారు.

































