భారీగా తరలిచ్చిన తెలుగు రాష్ట్రాల వీక్షకులు – ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులు – ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర నేతల రాకతో హడావుడివిజయవాడ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కొనసాగుతోంది.
వేడుకల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా మొదలయ్యాయి. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో కోలాహలం నెలకొంది. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడిపందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి తదితరులు తిలకించారు. బరుల వద్ద పందెం రాయుళ్లు, వీక్షకులతో కోలాహలం నెలకొంది. సంప్రదాయంగా భావించే ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో కోడి పందేలకు బరులు ముస్తాబయ్యాయి. ఈ పందేలను చూసేందుకు దూరప్రాంతాల ప్రజలు సైతం పెద్దఎత్తున తరలివస్తున్నారు. బరుల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేశారు నిర్వాహకులు. గతంలో లాగానే ఈసారీ కోట్ల రూపాయల్లో పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కోనసీమ జిల్లా అమలాపురంలో కోడిపందేలు, గుండాటలు ప్రారంభమయ్యాయి. ప్రతి గ్రామంలోనూ కోడిపందేలు, గుండాటలు ఏర్పాటయ్యాయి. ‘మూడు బరులు.. ఆరు బోర్డులు’ అన్నట్లు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 150కిపైగా కోడిపందేల బరులు ముస్తాబయ్యాయి. గుడివాడ నియోజకవర్గంలో సంక్రాంతి కోడిపందేలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కోడిపందేలు, కోత ముక్కలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న పరిస్థితి. బరులు జాతరను తలపిస్తున్నాయి. హోరాహోరీగా కోడి పందేలు జరుగుతున్నాయి. కోడి పందేలను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో బరులను ఏర్పాటుచేశారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా మొదలయ్యాయి. కైకలూరు మండలం భుజబలపట్నంలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేసి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ పందేలను ఎమ్మెల్సీ జయమాంగళ వెంకటరమణ తిలకించారు.కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. బరుల్లో భారీ లైవ్ స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో పాటు నాయకులు, ప్రజలు కూర్చుని చూసేందుకు బరిచుట్టూ స్టేజ్‌ను నిర్వాహకులు ఏర్పాటుచేశారు.
































