ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో గాలిపటాలు ఎగరవేస్తుంటారు.
అహ్మదాబాద్‌లో 2026 జనవరి 10 నుంచి 14 వరకు అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం నిర్వహించారు. ఇందులో రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా సహా 50 దేశాల నుంచి 135 మంది గాలిపటాలు ఎగరేసేవారు పాల్గొన్నారు.
చిలీ, కొలంబియా, దక్షిణ కొరియా నుంచి అత్యధిక సంఖ్యలో పోటీదారులు వచ్చారు, ప్రతి దేశం నుంచి ఆరుగురు పోటీపడ్డారు.
ప్రస్తుతం, గాలిపటాలను వినోద రూపంగానే చూస్తున్నారు. కానీ, చరిత్ర పరిశీలిస్తే గాలిపటాల ప్రాముఖ్యం, వాటి కారణంగా ఎంత పెద్ద ఆవిష్కరణ జరిగిందో తెలుస్తుంది.
ప్రపంచ యుద్ధాల నుంచి విమానాల అభివృద్ధి వరకు ప్రతిదానిలోనూ గాలిపటాలను ఉపయోగించారని మీకు తెలుసా?.
ఇటీవల, అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో భారత ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గాలిపటాలను ఎగరవేశారు.
గాలిపటం ఎక్కడ తయారు చేశారు?
ఇప్పుడు గాలిపటాలు ఎగరేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, అది భారత్ పొరుగు దేశమైన చైనాలో పుట్టింది.
అమెరికన్ కైట్ ఫ్లయర్స్ అసోసియేషన్ ప్రకారం, గాలిపటాలు చైనాలో పుట్టాయని చాలామంది పండితులు భావిస్తున్నారు. అయితే, మలేసియా, ఇండోనేసియా, దక్షిణ పసిఫిక్‌లోని ప్రజలు ఆకులు, రెల్లు వంటి సహజ పదార్థాల నుంచి గాలిపటాలను తయారు చేసి చేపలు పట్టడానికి ఉపయోగించారని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.
450 బీసీలో, ప్రసిద్ధ చైనీస్ తత్వవేత్త మోజి మూడేళ్లు శ్రమించి చెక్కతో పక్షి లాంటి వస్తువును తయారుచేశారు, దానిని తీగతో ఎగరవేయవచ్చు. కొందరు అదే ‘గాలిపటం’ అంటున్నారు.
గాలిపటం 200 బీసీ నాటిదని, దాన్ని చైనాలో కనుగొన్నారని పురాతన లిఖిత ఆధారాలు చెబుతున్నాయని మరో రిపోర్టు పేర్కొంది.
హాన్ రాజవంశ జనరల్ అయిన హాన్ జిన్, ఒక నగరంపై దాడికి దిగిన సమయంలో ఆ నగరంలోని గోడలపై గాలిపటాలు ఎగరవేశారని చెబుతారు. తన సైన్యం గోడల కింద తవ్వాల్సిన సొరంగం పొడవును కొలవడానికి ఇది సహాయపడిందని అంటుంటారు.
చైనా వ్యాపారులు 13వ శతాబ్దం నాటికి కొరియా, భారత్, ఇతర ఆసియా, మధ్యప్రాచ్యంలోని దేశాలకు గాలిపటాలు తీసుకువచ్చారు. అయితే, ప్రతి ప్రాంతంలోని ప్రజలు తమ సొంత వైవిధ్యమైన గాలిపటాలను అభివృద్ధి చేసుకున్నారు. వివిధ సందర్భాలలో వాటిని ఎగరవేశారు.
అహ్మదాబాద్‌లో 2026 జనవరి 10 నుంచి 14 వరకు అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం నిర్వహించారు.
భారతదేశానికి ఎలా వచ్చాయి?
భారతదేశంలో గాలిపటాలనేవి మొఘల్ కాలం నాటివి. దీనికి రుజువు క్రీ.శ. 1500 నాటి చిన్న పెయింటింగ్స్. ఒక యువకుడు తన ప్రియురాలికి గాలిపటం ఉపయోగించి సందేశం పంపడం ఈ పెయింటింగ్స్‌లో కనిపిస్తోందని నేషనల్ కైట్ మంత్ తెలిపింది.
గుజరాత్ టూరిజం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారంమేరకు, గాలిపటాలను మొదట ముస్లిం వ్యాపారులు లేదా చైనీస్ బౌద్ధ యాత్రికులు భారతదేశానికి పరిచయం చేశారు. చైనా యాత్రికులు బౌద్ధమతానికి సంబంధించిన పుస్తకాల కోసం భారతదేశానికి వచ్చేవారు.
వెయ్యేళ్ల కిందట, శాంతానంబే అనే మ్యుజీషియన్ తన సంగీతంలో గాలిపటాల గురించి ప్రస్తావించారు. ఇంకా, ఆ కాలం నాటి అనేక పురాతన సూక్ష్మ చిత్రాలు ప్రజలు గాలిపటాలు ఎగరేస్తున్నట్లు వర్ణిస్తాయి.
గుజరాత్ భారతదేశం పశ్చిమ కొనపై ఉంది. ఇక్కడ హిందూ ముస్లిం సంస్కృతులు ఉన్నాయి. అందుకే ముస్లింలు తెచ్చిన గాలిపటాలను మకర సంక్రాంతి వంటి హిందూ పండుగలను జరుపుకోవడానికీ ఉపయోగించేవారు.
మిరాకిల్ కైట్స్ ప్రకారం, గాలిపటాలు మొదట భారతదేశంలో మతపరమైన చిహ్నంగా తయారు చేశారు. ప్రజలు తమ కోరికలు, ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి వాటిని ఎగరవేసేవారు. కాలక్రమేణా, గాలిపటాలు ఎగరవేయడం ప్రజాదరణ పొందింది. చివరికి గాలిపటాల పండుగలు, పోటీలు నిర్వహించడం మొదలైంది.
కెమెరా అమర్చిన ఫ్రెంచ్ యుద్ధ గాలిపటం (1915)
యుద్ధ సమయంలో ఎలా వాడేవారు?
అమెరికన్ కైట్ ఫ్లయర్స్ అసోసియేషన్ ప్రకారం, మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918) సమయంలో, బ్రిటిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, రష్యన్ సైన్యాలు ప్రత్యేక గాలిపటాలను ఎగరవేసే యూనిట్లను ఏర్పాటు చేశాయి.
శత్రువుల కదలికలను అర్థం చేసుకోవడానికి, సందేశాలను పంపడానికి వాటిని ఉపయోగించారు. రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) లో, యూఎస్ నావికాదళం కూడా వైమానిక రక్షణ మొదలు అనేక ప్రయోజనాల కోసం గాలిపటాలను ఉపయోగించింది.
ఫాక్స్ వెదర్ రిపోర్ట్ ప్రకారం, వాషింగ్టన్‌లోని వరల్డ్ కైట్ మ్యూజియంలో “వార్ రూమ్” అనే గది ఉంది. ఈ గదిలో యుద్ధంలో ఉపయోగించే గాలిపటాలు మాత్రమే ఉన్నాయి.
ఇక్కడ రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభ రోజుల్లో ఉపయోగించిన “బ్యారేజ్ కైట్” కూడా ఉందని మ్యూజియం వైస్ ప్రెసిడెంట్ జిమ్ స్యూస్ తెలిపారు. ”ఈ బ్యారేజ్ కైట్‌ను వాణిజ్య నౌకల పై నుంచి ఎగరవేశారు. గాలిపటానికి ఒక తీగ కట్టి ఆకాశంలోకి పంపేవారు. వ్యాపార నౌకపై దాడి చేయడానికి శత్రు విమానం వస్తే, అది ఈ తీగను ఢీకొట్టి, విమానం అల్యూమినియం రెక్కలను ముక్కలు చేసేది” అని జిమ్ స్యూస్ చెప్పారు.
1890ల నాటి గాలిపటం ఉదాహరణను జిమ్ స్యూస్ వివరించారు.
“అప్పట్లో జర్మన్ కార్గో విమానం చిత్రంతో ఒక త్రిభుజాకార గాలిపటం ఉండేది. ఈ గాలిపటం శిక్షణ కోసం ఉపయోగించారు” అని తెలిపారు.
“ఈ గాలిపటాన్ని నౌకకు అనేక వందల గజాల దూరానికి ఎగరవేసేవారు. అప్పుడు నౌకలో మెషిన్ గన్లు పట్టుకున్న సైనికులు గాలిపటం లక్ష్యంగా కాల్పులు జరిపేవారు. గాలిపటంపై ఉన్న విమానం చిత్రాన్ని నిజమైన శత్రు విమానంలాగా చూస్తూ వారు సాధన చేసేవారు. ఇది వారికి గురి నేర్చుకోవడానికి సహాయపడింది” అన్నారు జిమ్ స్యూస్.
గాలిపటాలను చైనాలో కనుగొన్నారని చాలామంది విశ్లేషకులు భావిస్తారు.
విమానం ఆలోచన
అమెరికన్ కైట్ ఫ్లయర్స్ అసోసియేషన్ రిపోర్ట్ ప్రకారం, “విమానాన్ని కనుగొన్న రైట్ బ్రదర్స్ గాలిపటాలను ఎగరవేయడంలో చాలా నిష్ణాతులు. ఏళ్ల తరబడి గాలిపటాలు ఎగరవేయడం వల్ల వారికి విమానం నిర్మించాలనే ఆలోచన వచ్చింది. ఒక రోజు కిట్టి హాక్‌లో గాలిపటాలను ఎగరవేస్తున్నప్పుడు, ఓ గాలిపటం ఒక మనిషిని నేలపై నుంచి కొద్దిగా పైకి లేపడాన్ని గమనించారు”
1899 ఆగస్టులో వారు ఒక బైప్లేన్ గాలిపటాన్ని నిర్మించారు. గాలిపటం నాలుగు మూలలకు కట్టిన తీగలను వివిధ మార్గాల్లో లాగడం ద్వారా, గాలిపటం రెక్కలను పక్షి రెక్కల మాదిరిగా వంచవచ్చని తెలుసుకున్నారు.
తర్వాత, 1901లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన టెట్రాహెడ్రల్ గాలిపటం మొదటి నమూనాను తయారుచేశారు. ఇది చాలా బలమైన గాలిపటం. అనేక చిన్న గాలిపటాలను అనుసంధానించడం ద్వారా పెద్ద గాలిపటాన్ని తయారుచేశారు. ఈ చతుర్భుజ గాలిపటం 288 పౌండ్ల బరువును అంటే దాదాపు 130 కిలోల బరువును పైకి లేపగలింది.


































