కొత్త ఏడాది 2026 ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ తీపి కబురు అందించింది.
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కార్ప్స్ ఆఫ్ ఇఎంఇ లో పనిచేస్తున్న అర్హులైన డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులకు బోనస్ అందిస్తామని తెలిపింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జనవరి 7, 2026వ తేదీనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.పీఎల్బీ స్కీమ్ ద్వారా అర్హులైన ఉద్యోగులకు 22 రోజుల వేతనానికి సమానమైన బోనస్ అందిస్తామని తెలిపింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎవరెవరు అర్హులు?
ఈ బోనస్ ప్రయోజనం అందరికీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం
ఇఎంఇ డైరెక్టరేట్ (EME Directorate) పరిధిలోని గ్రూప్ ‘బి’ (గెజిటెడ్ కాని వారు), గ్రూప్ ‘సి’ సివిలియన్ ఉద్యోగులు అర్హులు. అలాగే పీఎల్బీ పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అందుతుంది.
బోనస్ లెక్కింపు ఎలా?
బోనస్ లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ఠ పరిమితిని రూ.7,000గా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఫార్ములా ఆధారంగా 22 రోజుల వేతనాన్ని లెక్కించి ఉద్యోగులకు అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న ఇతర నియమ నిబంధనలు, షరతులు యథాతథంగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ బోనస్ చెల్లింపుల కోసం అయ్యే వ్యయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సర్వీస్ అంచనాల బడ్జెట్ నుంచే ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా, కేటాయించిన బడ్జెట్ నుంచే నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది.
సాధారణంగా ప్రభుత్వం దీపావళి సమయంలోనే రైల్వే, పోస్టల్ వంటి విభాగాలకు ఇలాంటి ఉత్పాదక ఆధారిత బోనస్‌లను ప్రకటిస్తుంది.అయితే, ఇఎంఇ విభాగం పనితీరు, ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకుని, 2024- 25 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ తాజాగా ఈ 22 రోజుల బోనస్‌ను మంజూరు చేసింది. ఇది ఉద్యోగుల పనితీరును గుర్తించి, వారిని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని నిపుణులు పేర్కొంటున్నారు.

































