అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో పెను ప్రమాదం సంభవించింది. మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్జీసీ (ONGC) డ్రిల్లింగ్ సైట్ వద్ద సోమవారం ఒక్కసారిగా గ్యాస్ లీకై బ్లో అవుట్ కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.
ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో, వర్క్ ఓవర్ రిగ్గుతో దానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గ్యాస్, క్రూడ్ ఆయిల్ పీడనంతో పైకి ఎగసిపడ్డాయి. దీంతో బావి వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి .. పైగి ఎగసి పడుతున్నాయి.
ఈ ఘటనతో ఇరుసుమండ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లీక్ అయిన గ్యాస్ , దట్టమైన పొగ గ్రామం మొత్తం విస్తరించడంతో ఊపిరి తీసుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన పంచాయతీ సిబ్బంది, స్థానిక అధికారులు తక్షణమే స్పందించి గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదం పొంచి ఉన్నందున ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్ , ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా చూడాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు.
కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి మంటలను అదుపు చేసే ప్రక్రియను పర్యవేక్షించారు. తక్షణమే నిపుణుల బృందాలను రంగంలోకి దించి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓఎన్జీసీ సాంకేతిక బృందం ప్రస్తుతం లీకేజీని అరికట్టేందుకు శ్రమిస్తోంది. ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు కోరారు.



































