భారత చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి:
విశాఖలో గూగుల్ పెట్టబోయే పెట్టుబడులు భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (గా నిలుస్తున్నాయి. ప్రారంభ ప్రణాళిక ప్రకారం రూ. 87,520 కోట్ల పెట్టుబడిగా ఊహించగా, తరువాత దాన్ని పెంచి 1.33 లక్షల కోట్లు (సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటివరకు ఏ రాష్ట్రానికీ లభించని అత్యంత భారీ పెట్టుబడి. గూగుల్ ప్రకటించిన ప్రకారం, అమెరికా వెలుపల ఏర్పాటు చేయబోతున్న అతి పెద్ద ఆఈ డేటా సెంటర్ ఇది కానుంది. దీని ద్వారా భారత్‌లోనే కాకుండా మొత్తం ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి డిజిటల్ సపోర్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా ప్రాసెసింగ్ సౌకర్యాలు లభించనున్నాయి. ఈ కేంద్రం ద్వారా గిగావాట్ స్థాయిలో కంప్యూటింగ్ సామర్థ్యాన్ని వినియోగించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను దశల వారీగా విస్తరించే ప్రణాళికతో గూగుల్ ముందుకు వెళ్తుంది. 2029 నాటికి రాంబిల్లి, అడవివరం, తుర్లవాడ ప్రాంతాల్లో మూడు విభిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు నిర్మించి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు గూగుల్ అధికారికంగా వెల్లడించింది. గూగుల్ అధికారులు విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి వెనుక ఉన్న ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొన్ని నెలలుగా చంద్రబాబు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్‌లు స్వయంగా గూగుల్ టాప్ మేనేజ్మెంట్తో నిరంతరం చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని కుదిర్చారు.
మంగళవారం ఢిల్లీలోని తాజ్ మాన్సింగ్ హోటల్లో జరిగిన ‘భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తి’ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హాజరయ్యారు.గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది స్థానిక యువతకు నేరుగా మరియు పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఐటీ, ఇంజినీరింగ్, డేటా సైన్స్, నెట్వర్కింగ్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కొత్త అవకాశాలు విస్తరించనున్నాయి.ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే విశాఖపట్నం దక్షిణ ఆసియాలోని అతిపెద్ద టెక్నాలజీ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ప్రతిష్టాత్మక మైలురాయిగా ఏపీ ఈ భారీ పెట్టుబడి ఏపీ అభివృద్ధి చరిత్రలో ఒక ప్రతిష్టాత్మక మైలురాయిగా నిలవనుంది. డేటా సెంటర్‌తో పాటు గూగుల్ తన భాగస్వామ్య సంస్థల ద్వారా స్థానిక విద్యా సంస్థలతో కూడా భాగస్వామ్యం ఏర్పరచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కార్యక్రమాలు, రీసెర్చ్ ల్యాబ్‌లు ప్రారంభించబోతోంది.
విశాఖలో గూగుల్ ఏర్పాటు చేయబోతున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం భారతదేశ టెక్నాలజీ రంగంలోనూ కొత్త దిశ చూపబోతుంది. ఈ నిర్ణయం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన విజన్ 2047 దిశగా ముందుకు అడుగుపెట్టారని చెప్పాలి. ప్రపంచానికి తెలుగు రాష్ట్రం నుండి ఒక కొత్త టెక్ మిరాకిల్ పుట్టబోతోందని చెప్పడం అతిశయోక్తి కాదనే చెప్పాలి..!
































