అమరావతి: పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీకి (YSR Congress) హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్-13ఏపై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుంది. హైకోర్టు తీర్పును సుప్రీంలో వైసీపీ సవాల్ చేయనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వెల్లడించారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవివేట్ దాఖలు చేశారు. వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ కేవియట్ దాఖలు చేశారు. వైసీపీ సుప్రీంను ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని కేవియట్‌లో వెలగపూడి పేర్కొన్నారు.
ఏపీ హైకోర్టు ఏం చెప్పింది..?
ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసి, ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వైసీపీకి అవకాశం కల్పించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యాన్ని పరిష్కరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శనివారం నాడు తీర్పు చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌కు సంబంధించి ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు ఇదే పిటిషన్‌లో తనను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని రకాల అడ్డదార్లు తొక్కి విఫలమైన వైసీపీ, చివరికి కోర్టులో కూడా భంగపాటుకు గురైంది. ఎన్నికల అధికారులు, విపక్షాలపై అనేక విమర్శలు చేసిన వైసీపీ చివరికి పోస్టల్ బ్యాలెట్‌పై భారీ ఆరోపణలు గుప్పించింది. పోస్టల్ బ్యాలెట్‌ను తప్పుదోవ పట్టించి టీడీపీని దెబ్బకొట్టాలని ప్రయత్నించింది.