A setback for YCP over postal ballots
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో YCP కు ఎదురుదెబ్బ
పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫారం- 13ఏ’పై అటెస్టింగ్ అధికారి పేరు, హోదా, సీలు లేకపోయినా పర్వాలేదు, ఆ అధికారి సంతకం ఉంటే చాలు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేస్తూ సీఈసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దీని ఆధారంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఈ నెల 25, 27వ తేదీల్లో జారీ చేసిన మెమోలను సవాలు చేస్తూ వైకాపా ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం వేసింది. ‘‘ఈసీ ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ట్ర సీఈఓ జారీ చేసిన ఉత్తర్వులున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌పై అటెస్టేషన్ లేకపోతే వాటిని తిరస్కరించడం తప్ప వేరే మార్గం లేదు. చెల్లని ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలన్నట్లు సీఈఓ ఉత్తర్వులున్నాయి. మెమోల అమలును నిలుపుదల చేయాలి’’ అని పిటిషన్‌లో కోరారు. పిటిషనర్ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులను ప్రస్తావించిన ధర్మాసనం.. సీఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.