పరీక్షలు అంటే విద్యార్థులకు తీవ్ర ఒత్తిడికి లోనవ్వడం సహజంగా జరుగుతుంటుంది. అందులో ఇంటర్, పదవ తరగతి విద్యార్థులు బోర్డు ఎగ్జామ్స్ అంటే తీవ్రంగా తీసుకుని మంచి ర్యాంకుల సాధనకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అయితే ఓ విద్యార్థి పాము కరిచి ఆసుపత్రిలో ఉన్నా లెక్క చేయకుండా పదో తరగతి పరీక్ష రాయడం వైరల్ గా మారింది. వార్షిక పరీక్ష తప్పి పోకుడదన్న ఆ విద్యార్థి లక్ష్యం ముందు పాముకాటు భయం ఓడిపోయింది.
వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో వై. నిస్సి అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. పబ్లిక్ పరీక్షలు సమీపించడంతో శనివారం సాయంత్రం పాఠశాలలోని ఓ చెట్టు కింద కూర్చొని చదువుకుంటూ ఉండగా.. పక్కనే ఉన్న ఓ రాయి కింద చేయి పెట్టగా.. ఏదో కుట్టినట్లు అనిపించింది. వెంటనే రాయి పక్కకి తీసి చూడగా తాచుపాము పిల్ల కనిపించింది. తాచుపాము కాటు వేసిందని గ్రహించిన ఉపాధ్యాయులు హుటాహుటిన నిస్సిని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.
అయితే సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఓ వైపు జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ ఎగ్జామ్.. మరోవైపు ప్రాణాలనే కబళించే తాచుపాము కాటు. విద్యార్థి నిస్సి మాత్రం పాము కాటు నుంచి పూర్తిగా కోలుకోకముందే.. ప్రాణాపాయం పొంచి ఉన్నా భయపడకుండా చికిత్స మధ్యలోనే అసుపత్రి నుంచి నేరుగా లక్ష్మీ నరసాపురంలోని పరీక్షా కేంద్రానికి వెళ్లి విజయవంతంగా పరీక్ష రాశాడు. అనంతరం మళ్లీ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లాడు. పరీక్షల పట్ల, చదువు పట్ల విద్యార్థి నిస్సికి ఉన్న శ్రద్దను చేసిన ఉపాధ్యాయులు, స్థానికులు అతడిని అభినందనలతో ముంచెత్తారు.