భూమిపైకి రాగానే కన్నవాళ్లు భారం అనుకున్నారు! బాల్యమంతా ఆర్థిక ఇబ్బందులు. అయినప్పటికీ చదువును అశ్రద్ధ చేయలేదు. పట్టుదల, సంకల్పంతో అడ్డంకుల్ని అధిగమించింది.
చివరకు తన కలను సాకారం చేసుకుంది. ఆమే మహిళా ఐఏఎస్ సంజితా మహాపాత్ర. అయినవాళ్లు వద్దనుకున్న దగ్గర నుంచి ఐఏఎస్‌గా ఎదగడం వరకు ఎదుర్కొన్న అవరోధాలను ఆమె ఇటీవల ఓ సమావేశంలో పంచుకుంది. తన బాల్యాన్ని గుర్తుకుతెచ్చుకుంది.
ఒడిశాలోని రావూర్కెలాలో ఓ పేద కుటుంబంలో సంజితా మహాపాత్ర జన్మించారు. తల్లికి మొదటి సంతానం అమ్మాయి. రెండోసారి మగబిడ్డ పుట్టాలని తల్లి ఎంతో ఆశించింది. తీరా ఆడపిల్ల పుట్టడంతో భారంగా భావించి.. వదిలేయాలనుకుంది. కానీ సోదరి పట్టుబట్టడంతో విడిచిపెట్టలేకపోయింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో సంజితా బాల్యం మొత్తం ఇబ్బందులతోనే గడిచిపోయింది.
ఎలాగైనా చదువుకుని తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలనుకునుంది. ఎన్ని సమస్యలున్నా పట్టువిడవలేదు. సామాజిక సంస్థలు, ఉపాధ్యాయులు, స్కాలర్‌షిప్‌ల సహకారంతో చదువు పూర్తిచేసింది. అలా మెకానికల్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించుకుంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులకు వారి గ్రామంలోనే ఇల్లు కట్టుకొనేందుకు సాయం చేసింది.
చిన్నతనం నుంచే ఐఏఎస్ (IAS) అధికారి కావాలనేది ఆమె ఆకాంక్ష. భర్త సాయంతో దాన్ని కూడా సాధించింది. 2019లో తన ఐదో ప్రయత్నంలో యూపీఎస్సీ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం అమరావతి జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్నారు. మహిళల సాధికారత, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కోసం కృషి చేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల (SHGs) నుంచి వచ్చే ఉత్పత్తులు, బ్రాండింగ్, ప్యాకేజింగ్ వంటి మార్కెట్లపై దృష్టి సారించారు. తాను సాధించిన విజయాల పట్ల తల్లిదండ్రులు గర్వపడుతున్నారని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
































