సమర్ధవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు.
మొదటగా ప్రతిశాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని.. అంతిమంగా ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎంవోతో సహా ఆర్టీజీఎస్‌కు చెందిన అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
వాట్సప్ వేదికగా సరికొత్త వ్యవస్థ :
కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సప్‌ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ పరిశీలించాలని అన్నారు.
విజువల్స్ ఇంటిగ్రేషన్ :
డ్రోన్లు, సీసీ కెమేరాలు, శాటిలైట్లు, ఐవోటీ డివైజ్‌ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్‌ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఇటీవల గూగుల్ మ్యాప్‌ల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ల సాయంతో ధృవీకరించుకోవడం జరిగిందని.. అలాగే రానున్న రోజుల్లో పంట తెగుళ్లను గుర్తించి, రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్లు వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే రాష్ట్రంలోని రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు డ్రోన్ల ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
ధాన్యం సేకరణపై రైతుల్లో సంత్పప్తి :
రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో సంతృప్తి వ్యక్తమవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఐవీఆర్ఎస్ ద్వారా చేపట్టిన అభిప్రాయ సేకరణలో నాణ్యతకు తగ్గ ధర, 48 గంటల్లో డబ్బులు జమ చేయడం, రవాణా సౌకర్యం, గోనె సంచుల లభ్యతపై 90 శాతానికి పైగా రైతులు తమ సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. సంతృప్తి స్థాయి తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగ్గా సేవలు అందించవచ్చని ముఖ్యమంత్రి అన్నారు. ఒకవేళ ఎక్కడైనా అసంతృప్తి ఉంటే..ఎందుకు వ్యక్తమవుతోందనే దానిని పరిశీలించి తక్షణం ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికతను విశ్లేషించి, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
95 శాతం దాటిన హౌస్‌హోల్డ్ ట్యాగింగ్ :
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్ చివరి దశకు వచ్చిందని, ఇప్పటికే 95 శాతం కుటుంబాల జియో ట్యాగింగ్ పూర్తిచేశామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ట్యాగింగ్ సక్రమంగా జరిగిందా, లేదా అనేది సరిచూసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
రూ.20 కోట్లతో వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలు :
ఆధార్ సంబంధిత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన మరో వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన రూ.20 కోట్ల నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారు. వీలైనంగా త్వరగా గ్రామ – వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రత్యేక పోర్టల్ నందు భారీ ప్రాజెక్టుల ప్రగతి :
రాష్ట్రంలో రూ.100 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పర్యవేక్షణకు ఒకే పోర్టల్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేపడుతున్న 80 ప్రాజెక్టుల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో అప్డేట్ చేయాలని చెప్పారు.
జనన-మరణ ధృవ పత్రాలకు కొత్త పోర్టల్ :
రాష్ట్రంలో జనన – మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వత పరిష్కారంగా తీసుకువస్తున్న నూతన వెబ్ పోర్టల్‌ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీ రాజ్ – పట్టణాభివృద్ధి శాఖల సమన్వయంతో ఈ పోర్టల్ కొనసాగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.