AP Legislative Council: ఏపీలో శాసనమండలి రద్దు?

శాసనమండలిలో వైసీపీ ది స్పష్టమైన మెజారిటీ. 38 మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. అందుకే జగన్ సైతం శాసనమండలిపై ధీమాతో ఉన్నారు. శాసనసభలో సంఖ్యా బలం లేకపోయినా.. శాసనమండలిలో అధికార పార్టీకి చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు.


AP Legislative Council: ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తారా? ఆ దిశగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? వైసిపి ఆధిపత్యాన్ని గండి కొట్టాలంటే అదే మార్గమా? లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవా? కీలక బిల్లులకు మోక్షం రాదా? అందుకే రద్దు చేయడం ఉత్తమమని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రద్దు కంటే శాసనమండలిని అచేతన అవస్థలో పెట్టేందుకు ప్రయత్నిస్తారన్న టాక్ ప్రారంభమైంది.

శాసనమండలిలో వైసీపీ ది స్పష్టమైన మెజారిటీ. 38 మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. అందుకే జగన్ సైతం శాసనమండలిపై ధీమాతో ఉన్నారు. శాసనసభలో సంఖ్యా బలం లేకపోయినా.. శాసనమండలిలో అధికార పార్టీకి చెక్ చెప్పొచ్చని భావిస్తున్నారు. అందుకే ఓటమి ఎదురైన తర్వాత ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితోనే రాజకీయం నడపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అసెంబ్లీలో మనం లేకున్నా.. మండలిలో మనోళ్లే ఉంటారని.. వారే చూసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే అసెంబ్లీలో దక్కని అధికారాన్ని.. పరోక్షంగా మండలిలో వినియోగించుకునేందుకు వైసిపి ప్రయత్నిస్తుందన్నమాట.

2019 ఎన్నికల్లో 151 స్థానాలతో విజయం సాధించింది వైసిపి. కానీ శాసనమండలిలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. దీంతో కీలక బిల్లులను అప్పట్లో అడ్డుకోగలిగింది టిడిపి. అందుకే ఏకంగా మండలిని రద్దు చేసేందుకు నిర్ణయించారు జగన్. కానీ కేంద్రం అనుమతించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే శాసనమండలిలో వైసిపి ప్రాతినిధ్యం పెరిగింది. శాసనసభలో అంతులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమికి శాసనమండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు. దీంతో కీలక బిల్లులుగా భావిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని బిల్లులు, ఆర్ ఫైవ్ జోన్లో పేదలకు ఇచ్చిన ఇళ్ళను కూడా రద్దు చేయడం.. వంటి వాటిపై బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ శాసనమండలిలో వీటికి బ్రేక్ పడనుంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకునేందుకు అవకాశం మెండుగా కనిపిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాలన్న వాదన వినిపిస్తోంది. కూటమిలో సైతం బలమైన చర్చ సాగుతోంది. కానీ వచ్చే మూడేళ్లలో శాసనమండలిలో వైసిపి సంఖ్యాబలం తగ్గుతుంది. కూటమి సంఖ్యా బలం పెరుగుతుంది. అందుకే మండలిని రద్దు చేయడం కంటే.. సుప్త చేతనావస్థలో ఉంచేందుకు చూడాలని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలను చంద్రబాబు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో శాసనమండలిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.