ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ఇప్పుడీ పేరు ఓ అద్భుతం. ఈ సరికొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమవుతోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేకుండా దాదాపు అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది.
ఓవైపు ఏఐతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారన్న వస్తున్నాయి. మరోవైపు ఏఐ టెక్నాలజీ సృష్టిస్తున్న వింతలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
పాటలు రాయడం, పాడడం, మ్యూజిక్ అందించడంలో ఇలా ఒక్కటేమిటి ఏఐ చేయలేని పని అంటూ ఏది లేదనే వరకు పరిస్థితులు వెళ్లాయి. కాగా వైద్య రంగంలో కూడా ఏఐ సరికొత్త ఒరరవడి సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. వైద్యులకు కూడా సాధ్యంకాని వండర్స్‌ను ఏఐ క్రియేట్ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మనిషికి క్యాన్సర్ వచ్చే విషయాన్ని ఏఐ అత్యంత కచ్చితంగా కొన్నేళ్ల ముందుగానే చెప్పేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇందులో భాంగానే పరిశోధనలు జరుగుతున్నాయి. బోస్టన్లోని మాస్ జనరల్ బ్రిగమ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మెడిసిన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డానియల్ బిట్టర్మాన్ ఈ విషయమై మాట్లాడుతూ.. తాము ఏఐని ఉపయోగించే విషయంలో ఇంకా ప్రారంభదశలోనే ఉన్నామని చెబుతున్నారు. AI చాట్బాట్లు వైద్య సమాచారాన్ని సింథసైజ్ చేయగలవని ఆయన చెబుతున్నారు. దీని ఆధారంగా మనిషికి క్యాన్సర్ వచ్చే అవకాశాలను ఇట్టే చెప్పేస్తుంది.
చాట్ జిపిటి వెర్షన్ 3.5 వివిధ రకాల క్యాన్సర్‌కు ప్రాథమిక చికిత్స ఇవ్వగలుగుతుందని కనుగొన్నారు. క్యాన్సర్ మొదటి దశలోనే ఏఐ గుర్తిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ అభివృద్ధి చెందడానికి 5 సంవత్సరాల ముందు AI ఎలా గుర్తించగలదో ఇప్పటికే ఒక పరిశోధనలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో వెలువడిన ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సైతం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఒక మహిళ రొమ్ము ఎక్స్ రే ఆధారంగా ఆమెకు క్యాన్సర్ వస్తుందన్న విషయాన్ని ఏఐ ముందుగానే గుర్తించింది. ఈ లెక్కన రానున్న రోజుల్లో ప్రతీ ఒక్క హాస్పిటల్లో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ కొత్త టెక్నాలజీతో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని ఐదేళ్ల ముందుగానే గుర్తించారు. మరి భవిష్యత్తులో ఏఐ మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.