తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలు, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులతో ప్రతి ఇల్లు కళకళలాడుతున్నాయి.
ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం.. ఈ ఏడాది సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా జరుపుకుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ప్రధాన స్టూడియో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం, ఐదు దశాబ్దాల క్రితం దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్) ప్రారంభించిన సంప్రదాయానికి మరో గొప్ప ఉదాహరణగా నిలిచింది.
అన్నపూర్ణ స్టూడియోస్ ను 1976 సంక్రాంతి రోజున ఏఎన్‌ఆర్ స్థాపించారు. ఉద్యోగులను కేవలం సిబ్బందిగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూడాలన్న ఏఎన్‌ఆర్ దూరదృష్టితోనే.. ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన స్వయంగా ఉద్యోగులకు సేవ చేసి కృతజ్ఞతలు తెలపడం మొదలైంది. ఆ సంప్రదాయాన్ని ఆయన కుమారుడు నాగార్జున అక్కినేని, మనవళ్లు నాగచైతన్య తదితర కుటుంబ సభ్యులు ఇప్పటికీ అదే ఆత్మతో కొనసాగిస్తున్నారు.
ఈ స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణం సంప్రదాయ సంక్రాంతి శోభతో కళకళలాడింది. గత సంవత్సరాలకంటే భిన్నంగా, ఈసారి ఉద్యోగులతో పాటు వారి జీవిత భాగస్వాములు, పిల్లలను కూడా ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి ఉద్యోగి సంస్థలో విడదీయరాని భాగమన్న ఏఎన్‌ఆర్ ఆలోచనను ప్రతిబింబిస్తూ.. అక్కినేని కుటుంబ సభ్యులు స్వయంగా అల్పాహారం వడ్డించి, ఉద్యోగుల కుటుంబాలతో మమేకమయ్యారు.
కాగా మద్రాసు కేంద్రంగా ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో అన్నపూర్ణ స్టూడియోస్ కీలక పాత్ర పోషించింది. ఆధునిక సాంకేతికత, శిక్షణా కేంద్రాలు, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలతో ఈ సంస్థ వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కల్పిస్తూ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడింది. ఈ సందర్భంగా నాగార్జున అక్కినేని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ఈ మేరకు ఆ పోస్టులో.. తన తండ్రి ఏఎన్‌ఆర్ కల నెరవేరిందని, అన్నపూర్ణ స్టూడియోస్ ఈ రోజు దేశంలోని ప్రముఖ స్టూడియోలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. ఐదు దశాబ్దాలుగా స్టూడియో ప్రస్థానానికి అండగా నిలిచిన ఉద్యోగులు, సిబ్బంది, అలాగే మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలో నాగచైతన్య, శోభితా ధూళిపాళతో పాటు అక్కినేని కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు కూడా పాల్గొన్నారు.


































