మహిళల దుస్తులపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా తీవ్ర చర్చకు దారి తీస్తున్న వేళ.. మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఈ వివాదానికి కౌంటర్‌గా కనిపించేలా ఒక గుడి సమీపంలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టర్లో మహిళల సంప్రదాయ దుస్తులను చూపిస్తూ, ‘భక్తులకు మనవి’ అంటూ సందేశం ఇచ్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వివాదం నడుస్తున్న సమయంలోనే ఈ పోస్టర్ వెలుగులోకి రావడంతో, ఇది యాదృచ్ఛికమా? లేక ఉద్దేశపూర్వక సందేశమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పోస్టర్లో ‘భక్తులకు మనవి.. దేవాలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నుదుటిన కుంకుమ ధరించి, సాంప్రదాయ దుస్తులతో రావలయును. మహిళలు గాజులు లేకుండా, జుట్టు విరబోసుకుని రాకూడదు. హిందూ సంప్రదాయాన్ని పాటించాలి. మహిళలు తప్పనిసరిగా జడలు వేసుకుని వలయునని మనవి. దేవాలయ కమిటీ- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం’ అని రాసి ఉంది. పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడులు మన సంస్కృతి సంప్రదాయాలకు కేంద్రాలు అని ఓ నెటిజన్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది.


































