ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై ఇవాళ(శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటోగా ప్రత్యేక ధర్మాసనం విచారిస్తుంది.
హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రయోప్రయోజన వ్యాజ్యాన్ని కలిపి హైకోర్టు విచారించింది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై (YS Jagan Mohan Reddy) నమోదైన సీబీఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు చేగొండి హరి రామజోగయ్య (Former MP Hariram Jogaiah) పిటీషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై 309కి పైగా కేసులున్నాయని కోర్టుకు ఏఏజీ తెలిపింది. ఈ విచారణలో పురోగతిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏఏజీ సమయం కోరింది. వేగంగా విచారణ చేపట్టాలని ఇదే హైకోర్టు ఆదేశాలిచ్చిందని హరిరామజోగయ్య తరఫు న్యాయవాది తెలిపారు. మార్చి 31వ తేదీ వరకు ఉన్న అన్ని కేసుల విచారణ పురోగతిని సమర్పించాలని ఏఏజీకి హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులపై నాలుగు వారాల పాటు ప్రత్యేక ధర్మాసనం సమయం ఇచ్చింది.