చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ మిగిలిన మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. దాంతో పాటు కొందరికి పనితీరు ఆధారంగా ఉద్వాసన పలకబోతున్నట్టు సమాచారం.
ముఖ్యంగా ఉత్తరాంద్ర, రాయలసీమకు చెందిన నేతలకు మంత్రి పదవి నుంచి తొలగించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సర్కార్ ఈ నెల12తో యేడాది పూర్తి కాబోతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు లైన్ క్లియర్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. మొత్తం 25 మంత్రి పోస్టులకు గానూ.. కేవలం ఒక్క పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. కానీ కూటమిలో చాలామంది నేతలకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ప్రస్తుతమున్న నేతల్లో కొందరు నేతకు ఉద్వాసన పలకొచ్చని చెబుతున్నారు. ఇందులో ఉత్తరంధ్రాతో పాటు.. రాయలసీమ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది..
త్వరలోనే కేబినెట్ విస్తరణ జరిగితే.. టీడీపీలో కొందరు సీనియర్లకు మంత్రి పదవి దక్కొచ్చనే టాక్ ఉంది. అటు జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవిపై సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావుకు మంత్రి పదవి ఇవ్వొచ్చని టాక్ ఉంది. అయితే ఉన్నదే ఒక్క పోస్టు కాబట్టి.. మంత్రివర్గంలో సరిగ్గా పనిచేయని నేతలకు ఉద్వాసన పలుకుతారని టీడీపీ వర్గాలు అంటున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి నలుగురు మంత్రివర్గంలో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. విజయనగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత మంత్రులుగా కొనసాగుతున్నారు. వీరిలో మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో ఎవరికీ ఏ రకమైన అనుమానాలు లేవు. ఆయన అయిదేళ్ళ మంత్రిగా కదలించే సాహసం చంద్రబాబు చేయరు. మిగిలిన ముగ్గురులో ఒకరికి మంత్రి పదవి విషయంలో గండం ఉందని ప్రచారం అయితే సాగుతోంది.
మరోవైపు మంత్రుల పనితీరుపై ఇటీవల సీఎం చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్టు తెప్పించుకున్నారట. ఇందులో జనసేన పార్టీకి చెందిన ఓ మంత్రికి ఉద్వాసన పలకాలని డిసైడ్ అయ్యినట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే జనసేన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరుతుంది. అటు బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే కేటాయించారు. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి.. బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ స్థానంలో ఆయనకు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర వేరే శాఖను కేటాయించే అవకాశం ఉంది. అటు మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర ఎక్కువ శాఖలు ఉండటంతో.. ఆయన దగ్గర నుంచి కొన్ని శాఖలను ఇతరులకు మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే మంత్రుల విషయంలో భారీగా మార్పులు జరిగితే మాత్రం కొందరిని తప్పించడం ఖాయమనే అంటున్నారు. అలా కాకుండా ఉంటే స్వల్ప మార్పులతో సరిపెడితే ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరికీ ఇబ్బంది ఉండదని అంటున్నారు. జూన్ నెలలో మంత్రి వర్గంలో మార్పులు లేకపోతే మళ్ళీ మరో ఆరు నెలల కాలం దాకా ఆ ఊసు లేకపోవచ్చని అంటున్నారు. ఇక ఆగస్టులో మంచి రోజులు ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఆగస్టు యాంటీ సెంటిమెంట్ గా అనే టాక్ కూడా వినిపిస్తోంది. మంత్రి వర్గంలో మార్పులు అన్న టాపిక్ వచ్చినపుడల్లా ఉత్తరాంధ్రాలో చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రుల విషయంలో అనుచరులు టెన్షన్ పడుతున్నారని అంటున్నారు.
మొత్తంగా కూటమి సర్కార్లో కొందరు మంత్రులపై వేటు పడటం పక్కా అంటున్నారు. కానీ జనసేన పార్టీలో ఎవరైనా మంత్రికి ఉద్వాసన పలికితే పవన్ కల్యాణ్ ఊరుకుంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ దీనికి జనసేనాని ఒప్పుకోకుంటే ఏం జరుగుతుందో కూడా చూడాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ సీఎం చంద్రబాబుకు కత్తమీద సాములా మారిందని తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని కదిలించినా.. తేనేతుట్టను కదిపినట్టే. ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.
































