Andhra Pradesh: ఫస్ట్ టైమ్ ఆ జిల్లా ఓటర్ల విలక్షణ తీర్పు.. పాత సాంప్రదాయానికి చరమగీతం!

జిల్లా చరిత్రలోనే కనివిని ఎరుగని విక్టరీ… ఒక్కటంటే ఒక్కటి కూడా ఇతర పార్టీలకు దక్కని వైనం.. పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్స్, మూడు లోక్ సభ స్థానాల్లో కూటమి అభ్యర్ధులదే విజయం. కేవలం విజయమేనా.. భారీ మెజార్టీలు. సమీక్షించుకునే అవకాశం కూడా లేని విధంగా అధికార పార్టీకి ఘోర ఓటమి. ఈ ఫలితాలతో ఎలా ఉండబోతోంది ఏపీ రాజకీయం? విపక్షం ఉనికిని ఎలా చాటుకుంటుంది? ఇదే ఇప్పడు హాట్‌టాపిక్ మారింది.


గుంటూరు కారమే కాదు.. ఇక్కడి రాజకీయం కూడా యమ ఘాటు. అందుకే రాష్ట్ర రాజకీయాల్లోనే గుంటూరుజిల్లాకో ప్రత్యేక స్థానం. గత నాలుగు ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో విపక్ష కూటమికి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారు. 2004 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరుజిల్లాలో టీడీపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. 19 అసెంబ్లీ స్థానాల్లో 18 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. 2009లో పునర్విభజన తర్వాత పదిహేడు నియోజకవర్గాలుగా మారితే అందులో పదకొండు కాంగ్రెస్ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీకి ఐదు సీట్లొస్తే.. పన్నెండు స్థానాల్లో గెలిచి టీడీపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 15 సీట్లు గెలిస్తే.. టీడీపీ రెండు సీట్లతో సరిపెట్టుకుంది.

2004 నుంచీ నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే ఉమ్మడి గుంటూరుజిల్లా ప్రజలు పూర్తి ఏకపక్షంగా కాకుండా ప్రత్యర్ధి పార్టీలకు ఎంతో కొంత అవకాశమిస్తూ వచ్చారు. కానీ మొదటిసారి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లూ కూటమి ఖాతాలో పడ్డాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో ఈసారి పదహారు చోట్ల టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. జనసేనకు ఇచ్చిన తెనాలి నుంచి ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ గెలిచారు. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాన్ని వైసీపీనే గెలిచింది. అప్పట్లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు 20వేలకు పైనే మెజారిటీ వచ్చింది., అదే ట్రెండ్ కొనసాగిస్తూ ఈ సారి పల్నాడులోని ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఐదుగురు 25వేలకు పైనే మెజారిటీ సాధించారు. నర్సరావుపేటలో అరవింద్‌బాబుకు మాత్రమే 20వేల లోపు మెజారిటీ వచ్చింది. రాజధాని అంశం గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు ప్రాంతంలో గట్టి ప్రభావం చూపించిదన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత గుంటూరు గడ్డపై ఆ పార్టీకి ఇదే అతిపెద్ద విజయమని పార్టీ తమ్ముళ్లు సంబరపడుతున్నారు.