Botsa Satyanarayana about Anganwadi Strike in AP: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి అత్యవసరంగా సమావేశమైంది.
అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చింది. అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చుతామని మంత్రి బొత్స తెలిపారు. అంగన్వాడీల 13 డిమాండ్లలో 10 డిమాండ్లు నెరవేర్చామన్నారు. మిగతా డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం జగన్ తో చర్చిస్తామని చెప్పారు. మంత్రి బొత్స ప్రకటనతో అంగన్వాడీలు సమ్మె విరమించనున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం దీనిపై స్పష్టత రానుంది.
సోమవారం సాయంత్రం సైతం అంగన్వాడీలకు సర్కార్ రిక్వెస్ట్
ఇకనైనా ఆందోళన విరమించి, విధులకు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సోమవారం సాయంత్రం విజ్ఞప్తి చేసింది. పలు జిల్లాల్లో అంగన్వాడీలు విధుల్లో హాజరవుతున్నారని, రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. జాయిన్ అవుతున్నవారందరికీ ప్రభుత్వం తరఫున మంత్రి బొత్స ధన్యవాదాలు తెలిపారు. మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరారు.
అంగన్వాడీల అనేక డిమాండ్లను అంగీకరించాం
ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం అన్నారు. అంగన్వాడీలు కోరకపోయినా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించామని మంత్రి బొత్స అన్నారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని చెప్పారు. ప్రస్తుతం ఆందోళన సమయంలో కూడా అనేక డిమాండ్లను అంగీకరించాం. వాటిని అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం తరఫున ఉత్తర్వులు కూడా జారీచేశామన్నారు. మిగిలిన డిమాండ్ల పట్ల జగన్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. రాజకీయ శక్తుల చేతుల్లో చిక్కుకోవద్దని అంగన్వాడీలను మరోసారి కోరారు.
మీ ఆందోళన వేదికగా రాజకీయ పబ్బం గడుపుకోవాలని కొన్ని పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు యత్నిస్తున్నాయని.. అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వొద్దు అని అంగన్వాడీలకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. బాలింతలు, శిశువులకు ఇబ్బందిరాకుండా వెంటనే మీ సేవలు వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. విధులకు హాజరుకాని మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకావాలని కోరారు. అంగన్వాడీల సేవలు చాలా అవసరమని భావించి ఈ విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 12వ తేదీ నుంచి అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు గత 42 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరని వారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో చేరని గుంటూరు జిల్లాలో 1,734 మంది, పల్నాడు జిల్లాలో 1,358 మందిని తొలగిస్తూ ఆ జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. మిగతావారు సైతం విధులకు హాజరు కాకపోతే వారిని సైతం విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ప్రభుత్వం లక్ష మందికి నోటీసులు జారీ చేయగా, అందులో 20 శాతం మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు.
ఈ 24న బంద్కు ట్రేడ్ యూనియన్ల పిలుపు..
ఆంధ్రప్రదేశ్ బంద్కు ఏపీ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ నెల 24 తేదీన అందరూ బంద్ పాటించాలని ట్రేడ్ యూనియర్లు పిలుపునిచ్చాయి. పోరాడుతున్న అంగన్వాడి టీచర్లు, ఆయాలకు మద్దతుగా ఈ పిలుపునిచ్చారు. వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ బంద్కు మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు , టీఎన్టియుసి , ఐ.ఎన్. టి.యు.సి నేతలు పిలుపునిచ్చారు. ”ఒక లక్షా ఐదువేల మంది అంగన్వాడీ మహిళ శ్రామికుల జీతభత్యాలు, పనిభారలు తదితర సమస్యలపై సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ సంఘాల ఆధ్వర్యంలో గత 42 రోజులుగా సమ్మె జరుగుతున్నది. వారి డిమాండ్లకు మద్దతుగా ప్రజలనుండి సేకరించిన కోటి సంతకాలను జగన్ కి సమర్పించడానికి విజయవాడ వస్తున్న అంగన్వాడీలపై పాశవికంగా పోలీసులతో దాడి చేయించారన ట్రేడ్ యూనియన్ నేతలు ఆరోపించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అత్యంత నిరంకుశమైనదన్నారు.