దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు టారిఫ్ ధరలను పెంచడంతో లక్షలాది మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ (Bharat Sanchar Nigam Limited) సైతం కొత్త సేవలను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ క్రమంలో 4G నెట్వర్క్ విస్తరణ, 5G ప్రారంభానికి ముందు కొత్త లోగో ఆవిష్కరణ వంటి వంటి చర్యలు చేపట్టింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త సేవలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ కంపెనీ తన జాతీయ Wi-Fi రోమింగ్ సేవను కూడా ప్రారంభించింది.
ఇది BSNL FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులను భారతదేశం అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం.. BSNL FTTH కస్టమర్లు నిర్ణీత ప్రదేశంలో మాత్రమే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందుతున్నారు. అయితే.. BSNL కొత్త జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను పరిచయం చేయడంతో.. ఈ కస్టమర్లు త్వరలో భారతదేశంలో ఎక్కడి నుండైనా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఈ సేవలను ఎలా ఉపయోగించుకోవాలంటే?
వినియోగదారులు BSNL FTTH జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను ఉపయోగించుకోవడానికి.. తప్పనిసరిగా BSNL వెబ్సైట్లో https://portal.bsnl.in/ftth/wifiroaming లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో.. వినియోగదారులు ధృవీకరణను పూర్తి చేయడానికి వారి FTTH కనెక్షన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఈ కొత్త సేవల ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇమేజ్‌ని మెరుగుపరచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా నెట్వర్క్ పరిధిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా BSNL Wi-Fi కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు. దీని అర్థం వినియోగదారులు తమ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఇంట్లోనే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు.
ఇవే కాకుండా.. తాజాగా BSNL నెట్వర్క్ నుంచి కొత్త 7 రకాల సేవలు ప్రారంభం అయ్యాయి. స్పామ్ డిటెక్షన్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్ టూ డివైస్ సేవలు, వైఫై రోమింగ్, ఐఫ్‌టీవీ, రియల్‌టైం డిజాస్టర్ రెస్పాన్స్ సహా సెఫ్టీ ఫీచర్లతో సురక్షితమైన నెట్వర్క్, ఈ ఆక్షన్ వంటి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. కాల్ ఛార్జీలను పెంచే ఆలోచన తమకు లేదని బీఎస్ఎన్ఎల్ సీఎండీ రాబర్ట్ రవి ఇటీవల స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే 4G కమర్షియల్ సర్వీస్‌లు ప్రారంభిస్తామని కూడా అన్నారు.