ఏపీలో మందుబాబులకు కూటమి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటివరకూ మద్యం షాపులు, బార్ల మధ్య ఓ విషయంలో చూపుతున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం ఇవాళ రద్దు చేసింది.
దీంతో ఈ రెండు చోట్లా లభించే మద్యం ధరల్లో ఇకపై సమానత్వం రాబోతోంది. అలాగే మందుబాబులు తమకు అందుబాటులో ఉన్న చోటకు వెళ్లి మద్యం సేవించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో సంక్రాంతి వేళ బార్లతో పాటు మందుబాబులకూ ఊరట దక్కబోతోంది.
రాష్ట్రంలో ఇప్పటికే అమల్లో ఉన్న ఎక్సైజ్ విధానంలో ప్రభుత్వం ఇవాళ పలు మార్పులు చేసింది. దీని ప్రకారం గతంలో వైసీపీ హయాం నుంచి బార్లపై అమల్లో ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను రద్దు చేశారు. దీంతో మద్యం షాపులతో సమానంగా బార్లలోనూ మద్యం ధరలు ఉండబోతున్నాయి. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యంపై అదనపు పన్ను విధించడం లేదని ప్రభుత్వం ఇవాళ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
బార్లకు లైసెన్స్ ఇచ్చే సమయంలో విధించే నిబంధనల్లో ఈ అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా ఒకటి. దీని వల్ల సాధారణ మద్యం షాపులతో పోలిస్తే బార్లలో మద్యం ధరలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ పన్నును రద్దుచేయడంతో రెండు చోట్లా ఒకే రేట్లకు మద్యం దొరకనుంది. అలాగే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బార్ల వ్యాపారులకు సైతం పెద్ద ఊరట కానుంది. గతంలో మద్యం షాపులతో పోలిస్తే బార్లలో రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటి అమ్మకాలపైనా ప్రభావం పడేది. ఇప్పుడు ఆ పన్ను ఎత్తేయడంతో ఆ మేరకు బార్లకు ప్రయోజననం కలగబోతోంది.


































