టీటీడీలో మరో కుంభకోణం.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల స్వాహా

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా.. ఒక పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. 2015 నుండి 2025 వరకు, భక్తులకు పట్టు పేరుతో అందించిన శాలువాలు..


వాస్తవానికి పాలిస్టర్ అని తాజా నివేదికలు స్పష్టం చేశాయి. ఈ సంఘటనలో ముఖ్యంగా నగరానికి చెందిన వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థ పేరు ప్రస్తావనలోకి వచ్చింది.

తిరుమల ఆలయానికి పట్టు శాలువాలు ప్రత్యేక గుర్తింపు. వీఐపీలకు, దాతలకు, ముఖ్య అతిథులకు అందించే ఈ శాలువాలు సంప్రదాయం, భక్తిగా భావిస్తారు. అయితే ఈ విశ్వాసాన్నే కాపాడాల్సిన కాంట్రాక్టర్లు.. దీన్ని డబ్బు సంపాదనే మార్గంగా మార్చినట్టు విచారణల్లో తేలింది.

టీటీడీ విజిలెన్స్ విభాగం చేసిన పరిశీలనలో గత పదేళ్లుగా పట్టు పేరుతో.. అందించిన ఎక్కువ శాలువాలు పూర్తిగా పాలిస్టర్ అని బయటపడింది. ధర్మవరం, సిల్క్ బోర్డు నిర్వహించిన నాణ్యత పరీక్షలలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ. 54 కోట్లకు పైగా ఈ పాలిస్టర్ శాలువాల కొనుగోళ్లు జరిగి ఉండొచ్చని అంచనా.

టీటీడీకి సరఫరా చేసే పట్టు శాలువాలపై స్పష్టమైన టెండర్ నిబంధనలు ఉన్నప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ తక్కువ ధరపై పాలిస్టర్ శాలువాలను అసలు పట్టు అన్నట్లుగా సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

విజిలెన్స్ నివేదికలో మరో సంచలన అంశం బయటపడింది. పట్టు పేరుతో పాలిస్టర్ శాలువాల మోసం ప్రత్యేకంగా వీఐపీలకు, పెద్ద దాతలకు అందించే శాలువాల్లోనే ఎక్కువగా జరిగిందని గుర్తించారు.

విజిలెన్స్ శాఖ ఇప్పటికే ముందుగా కూడా కొన్ని అసాందర్యాలను గుర్తించింది. కానీ తాజాగా చేపట్టిన విస్తృత తనిఖీల్లో అయితే స్పష్టమైన ఆధారాలు లభించాయి.

విజిలెన్స్ నివేదికను పరిశీలించిన తరువాత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీకీ విచారణకు పంపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో టెండర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మార్చాలని సిఫారసు చేసినట్టు సమాచారం.

ఈ వ్యవహారంపై భక్తులు, హిందూ సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పట్టు పేరుతో పాలిస్టర్ ఇవ్వడం అంటే కేవలం నాణ్యత మోసం మాత్రమే కాదు, భగవంతుని పట్ల చేసిన అవమానం కింద పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.