వైకాపాకు మరో షాక్‌.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా

వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ (Marri Rajasekhar) రాజీనామా చేశారు. శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజును కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ పదవీకాలం 2029 వరకూ ఉంది. త్వరలో ఆయన తెదేపాలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైకాపాను వీడారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు.


చిలకలూరిపేట వైకాపా ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి విడదల రజనీని నియమించడంతో మర్రి రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజీనామా చేశారు. రాజశేఖర్‌ రాజీనామా చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పలువురు వైకాపా నేతలు అసెంబ్లీ లాబీలో ఆయనతో మాట్లాడేందుకు యత్నించారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఇప్పటికే తాను నిర్ణయం తీసుకున్నానని వైకాపా నేతలకు మర్రి రాజశేఖర్ తేల్చి చెప్పారు.