అన్న క్యాంటీన్లకు పూర్వవైభవం

www.mannamweb.com

అన్న క్యాంటీన్లకు పూర్వవైభవం రానుంది. పేదలకు చౌకగా భోజనం అందించే వీటిని పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వైపుగా చకచకగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోడలకు పట్టిన బూజు దులిపి, రంగులేసి, ఫర్నీచర్‌ ఏర్పాటు చేసి, సౌకర్యాలను మెరుగు పరిచే ప్రక్రియ కొద్దిరోజులుగా సాగుతోంది. పునరుద్ధరణ చర్యలు దాదాపు కొలిక్కి వచ్చాయి. తొలిదశలో జిల్లాలో మూడు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.

అన్న క్యాంటీన్లకు

పూర్వవైభవం

విజయనగరంలో రెండు, బొబ్బిలిలో ఒకటి తొలుత ప్రారంభం

తరువాత దశలో మరో రెండు

అన్న క్యాంటీన్లకు పూర్వవైభవం రానుంది. పేదలకు చౌకగా భోజనం అందించే వీటిని పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ వైపుగా చకచకగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోడలకు పట్టిన బూజు దులిపి, రంగులేసి, ఫర్నీచర్‌ ఏర్పాటు చేసి, సౌకర్యాలను మెరుగు పరిచే ప్రక్రియ కొద్దిరోజులుగా సాగుతోంది. పునరుద్ధరణ చర్యలు దాదాపు కొలిక్కి వచ్చాయి. తొలిదశలో జిల్లాలో మూడు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభం కానున్నాయి. అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ బృహత్తర పథకాన్ని తీసుకువచ్చింది. రూ.5కే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా రూ.5కే అందించేవారు. వీటిని కార్మికులు, కూలీలు, విద్యార్థులు, యాచకులు ఆశ్రయించేవారు. ఎంతో ఆదరణ పొందిన అన్న క్యాంటీన్లను 2019లో వైసీపీ అధికారం చేపట్టాక మూసేశారు. అప్పటి ఉంచి ఆ భవనాలు వృథాగా పడి ఉన్నాయి. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ప్రకటించడమే కాకుండా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన తొలి ఐదు సంతకాల్లో అన్నక్యాంటీన్ల ప్రారంభానికి సంబంధించినది ఒకటి. అప్పటి నుంచి అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు చర్యలు మొదలయ్యాయి. ఆగస్టు-15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో తొలి దశలో విజయనగరం నగరపాలక సంస్థలో రెండు, బొబ్బిలిలో మరొకటి ప్రారంభించాలని నిర్ణయించారు. రెండో దశలో మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

– అన్న క్యాంటీన్లను 2019లో వైసీపీ ప్రభుత్వం మూసేసినా టీడీపీ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సొంత డబ్బులతో బొబ్బిలి అన్న క్యాంటీన్‌ను గత రెండేళ్లుగా నడిపిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవడంతో ఇక నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ అన్న క్యాంటీన్‌ నడవనుంది.

చురుగ్గా ఏర్పాట్లు

విజయనగరం రింగురోడ్డు: ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న అన్న క్యాంటీన్లను నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎంఎం నాయుడు బుధవారం పరిశీలించారు. డీఈలు, ఏఈలతో కలిసి పరిశీలించి పునరుద్ధరణ పనులు చేస్తున్న వారికి పలు సూచనలు ఇచ్చారు. అన్ని వసతులతో సౌకర్యవంతమైన అన్న క్యాంటీన్లను సిద్ధం చేస్తున్నట్టు విలేకరులకు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంతంలో ఒకటి, నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో మరొకటి తిరిగి ప్రారంభిస్తున్నామన్నారు.