ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏపీని అడ్డంగా చీల్చిందన్న విమర్శలు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నికల్లో ఓటర్లు భారీ షాకిచ్చారు. ఒక్క సీట్లోనూ కాంగ్రెస్ ను గెలిపించకుండా ఏకంగా డిపాజిట్లు లేకుండా చేసేశారు. గత ఎన్నికల్లోనూ అదే పరిస్ధితి. ఇప్పుడు ముచ్చటగా ముడోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి రెండు నియోజకవర్గాలు మాత్రం ఆశలు రేపుతున్నాయి. సున్నా నుంచి రెండు సీట్లు గెల్చుకుంటే ఈసారి కాంగ్రెస్ అద్భుతం చేసినట్లే. రాష్ట్ర విభజన తర్వాత ప్రజాగ్రహంతో వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలనూ ఒక్క సీటు కూడా లేకుండానే ముగించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం సీఎం జగన్ తో విభేదిస్తున్న ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలను తెచ్చుకుని ఏకంగా పీసీసీ ఛీఫ్ పదవే కట్టబెట్టారు. వాస్తవంగా షర్మిల తప్ప ఆ పదవిలో ఎవరున్నా ఈసారి కూడా కాంగ్రెస్ హ్యాట్రిక్ ఓటమి ఖాయమై ఉండేది. కానీ షర్మిల ఎంట్రీతో నత్తలా పడి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కాస్త చలనం వచ్చింది.
దీన్ని సొమ్ముచేసుకుంటూ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని, వైసీపీలో సీట్లు రాని ఎమ్మెల్యేలను చేర్చుకుని కాంగ్రెస్ నావను షర్మిల నడిపిస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం రెండు చోట్ల ఆ పార్టీకి బోణీ కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉన్నఈ రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు భిన్నమైన అంశాలు దోహదం చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలోని శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నట్లు తాజా సర్వేలు చెప్తున్నాయి. శింగనమల నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి, మాజీ పీసీసీ ఛీఫ్ సాకే శైలజానాథ్ పై ఈసారి గెలుపు అంచనాలు కనిపిస్తున్నాయి. అదీ ముక్కోణపు పోటీలో శైలజనాథ్ వైపు ఓటర్లు మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వివాదరహితుడు కావడం, మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్లస్ అవుతున్నాయి.
మరోవైపు ఇదే జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కరికెర సుధాకర్ కూడా గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ మధ్య ముక్కోణపు పోటీ జరుగుతున్నా స్థానికంగా పట్టున్న మాజీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డికి సన్నిహితుడైన సుధాకర్ కు ఆయన నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న రఘువీరా సుధాకర్ కోసం మాత్రం నియోజకవర్గంలోని దాదాపు 500 గ్రామాలు స్వయంగా తిరిగారు. దీంతో రఘువీరాకు ఉన్న మంచిపేరు సుధాకర్ కు గెలుపుకు బాటలు వేస్తున్నట్లు తెలుస్తోంది.