మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుత విజయంతో భారత్ జగజ్జేతగా నిలిచింది. పురుషుల క్రికెట్లో ఎన్నో వరల్డ్ కప్ లు సాధించినా మహిళల వరల్డ్ కప్ లో మాత్రం టైటిల్ గెలవడం టీమిండియాకు ఇదే తొలిసారి.
దీంతో ఈ వరల్డ్ కప్ లో మేటి ప్రదర్శనతో ఆకట్టుకున్న క్రికెటర్లపై బీసీసీఐతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీకి చెందిన మహిళా క్రికెటర్, వరల్డ్ కప్ లో సత్తా చాటిన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికీ బంపర్ ఆఫర్ లభించనుంది.
వరల్డ్ కప్ ఛాంపియన్ నల్లపురెడ్డి శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం ఘనసన్మానం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్దమవుతోంది. రేపు విజయవాడకు రానున్న శ్రీ చరణిని గన్నవరం నుంచి భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆహ్వానించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్ధమైంది. అలాగే శ్రీ చరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సన్మానించనున్నారు. అనంతరం శ్రీచరణికి ఏ ఉద్యోగం ఇవ్వబోతున్నారో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె తోటి క్రికెటర్లకు డీఎస్పీ వంటి ఉద్యోగాలు లభించిన నేపథ్యంలో చరణికి కూడా ఆ స్ధాయిలో ఉద్యోగం లభించనుంది.
ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో శ్రీ చరణి అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. భారత్ చారిత్రాత్మక తొలి ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. చరణి తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టి, టోర్నమెంట్‌లో భారతదేశం తరపున రెండవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన చరణి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
మహిళల ప్రపంచకప్ ఫైనల్లోనూ శ్రీచరణి ప్రశాంతత, నైపుణ్యం, ఒత్తిడిలో బౌలింగ్ సామర్థ్యం ప్రశంసలు అందుకుంది. చరణి మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగుల్ని నిలువరించింది. ఫైనల్‌లో కీలకమైన వికెట్లు కూడా తీసింది. ఆమె ఎకానమీ రేటు దాదాపు 4.96, సగటు 27.64. ఈ గణాంకాలే ఆమెను మేటి స్పిన్నర్ గా నిలబెట్టడంతో పాటు భారత్ విజయంలో కీలకంగా మారాయి.
































