APలో ఒంటిపూట బడులు ఆలస్యం.. కారణమిదే

www.mannamweb.com


ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఫిబ్రవరి నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. గత పది రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. పిల్లలు, వృద్ధులు ఆ సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఎండలు మండతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో.. విద్యార్థుల కోసం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15 నుంచి తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూల్స్‌ అన్నింటిలో ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి.

ఇక తెలంగాణలో ఒంటిపూట బడులు అమల్లోకి రానుండంటంతో.. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి అమల్లోకి రావాలి కదా.. ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుందని జనాలు ప్రశ్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి వస్తాయి. ఈ ఏడాది తెలంగాణలో ఇదే తారీఖు నుంచి అమల్లోకి వస్తుండగా.. ఏపీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

తాజాగా దీనిపై ఓ అప్డేట్‌ వచ్చింది. అది ఏంటంటే.. ఏపీలో ఒంటిపూట బడులు ఆలస్యం కానున్నాయని.. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలుస్తోంది. ఈ ఏడాది పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో.. ఒంటిపూట బడులు ఆలస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీ పాఠశాల విద్యా కమిషనర్‌ అధికారి ఒకరు తెలిపారు. దాంతో ఏపీలో ఏప్రిల్‌ 1 నుంచి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి. దీనిపై ఆదేశాలు రావాల్సి ఉంది.

తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంటిపూట బడుల వేళ.. ఉదయం 8-12 గంటల వరకు ఒక్క పూట మాత్రమే బడులు కొనసాగుతాయి. అయితే 10 తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు ప్రాంరభం అవుతాయి. వీరికి తొలుత మధ్యాహ్న భోజనం పెట్టి.. ఆ తర్వాత క్లాసులు కొనసాగిస్తారు. పదో తరగతి పరీక్షలు ముగిశాక.. ఆయా స్కూళ్లలో ఉదయం పూటే ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.