AP Results: ఏపీ ఎన్నికల్లో విజయంపై వైసీపీ లెక్క ఇలా- టీడీపీ లెక్క అలా..!

AP Results: ఏపీ ఎన్నికల్లో విజయంపై వైసీపీ లెక్క ఇలా- టీడీపీ లెక్క అలా..!


ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో తాము విజయఢంకా మోగించడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

అయితే వీరి ధీమా వెనుక గల కారణమేంటన్న అనుమానం వారికి ఓట్లేసిన, వేయని ఓటర్లలోనూ కలుగుతోంది. దీనికి కారణం రాష్ట్రంలో ఫలితాలపై వ్యక్తమవుతున్న మిశ్రమ అంచనాలే.

ఏపీలో వైసీపీ గతంలో సాధించిన 151 సీట్లకు పైగా గెలిచి దేశమంతా తమవైపు తిరిగి చూసేలా చేస్తుందని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వైసీపీలో అంతర్గతంగా నేతల మధ్య జరుగుతున్న చర్చను బట్టి చూస్తుంటే కనీసం 120 సీట్లు గెల్చుకోవడం ఖాయమనే మాట వినిపిస్తోంది. అటు కూటమి నేతలను కదిపితే కనీసం 100-115 సీట్లు ఖాయమంటున్నారు. గాలి బాగా వీస్తే ఈ సంఖ్య 140 వరకూ వెళ్తుందని చెప్తున్నారు.

అయితే వైసీపీ లెక్కను ఓసారి చూస్తే.. రాయలసీమలో గతంలో 49 సీట్లు గెల్చుకుని దాదాపు క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఈసారి కూడా దానికి కాస్త అటు ఇటుగా అంటే 35-40 సీట్లు గెల్చుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కోస్తాంధ్రలో ప్రతీ జిల్లాల్లోనూ నామమాత్రపు సీట్లు లభించినా 9 ఉమ్మడి జిల్లాల్లో 40-50 సీట్లు ఖాయమని అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు కూటమి అంచనాలను ఓసారి గమనిస్తే .. రాయలసీమలో వైసీపీకి 25-30 సీట్లు వస్తాయని, మరో 20 సీట్లు తాము కైవసం చేసుకోవడం ఖాయమని భావిస్తున్నారు. అలాగే కోస్తాంధ్రలో జనసేనతో పొత్తు కారణంగా టీడీపీ, బీజేపీ కలిపి ఏకపక్షంగా పలు జిల్లాల్ని స్వీప్ చేయడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. కోస్తాంధ్రలోనే తమకు మ్యాజిక్ మార్కుకు అవసరమైన మెజార్టీ సీట్లు వచ్చేస్తాయని కూటమి పార్టీల నేతల అంచనా. అప్పుడు రాయలసీమ సీట్లను కూడా కలుపుకుంటే భారీ మెజార్టీ ఖాయమంటున్నారు.