APPSET: రేపటి నుంచి ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఈఏపీసెట్‌-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి.నవ్య శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.


ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఏపీఈఏపీసెట్‌-2024 అడ్మిషన్లకు సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్యశాఖ సంచాలకురాలు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి.నవ్య శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపును 1 నుంచి 7వ తేదీలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జూలై 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరుగుతుంది.

8 నుంచి 12వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు సమయం ఇచ్చారు. 13న విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మార్చుకోవచ్చని, 16న సీట్ల కేటాయింపు పూర్తి చేస్తామని కన్వీనర్‌ తెలిపారు. సెల్ఫ్‌ జాయినింగ్‌, కళాశాలలో రిపోర్టింగ్‌ చేయడానికి 17 నుంచి 22 వరకు అవకాశం కల్పించారు. 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని నవ్య వివరించారు. అయితే ఇంజనీరింగ్‌ కోర్సుల ఫీజులపై స్పష్టత రాలేదు.

గత ఏడాది మూడేళ్ల కాలానికి ఉన్నత విద్యా కమిషన్‌ ఫీజులు ఖరారు చేసింది. వాటిపై కొన్ని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఇది వివాదంగా మారడంతో న్యాయస్థానం సూచన మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి అందరికీ 10శాతం పెంపుతో ఫీజులు నిర్ణయించారు. అయితే అది తాత్కాలికమేనని, కమిషన్‌ కొత్త ఫీజులు ఖరారు చేయాలని కోర్టు సూచించింది.

దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంపై అడ్వొకేట్‌ జనరల్‌తో మాట్లాడాలని అధికారులకు మంత్రి లోకేశ్‌ తాజాగా సూచించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్‌ సీట్లు దాదాపు 2లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోంది. సీట్లపై ఏఐసీటీఈ పరిమితులు తొలగించడంతో కాలేజీలన్నీ సీట్లు పెంచుకున్నాయి. బి.ఫార్మసీ అడ్మిషన్లకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల కానుంది.