అసలే ఎండాకాలం. వేడికి తాళలేక ఉపశమనం కోసం చల్లటి పానీయాలను తీసుకుంటాం. బయటకు వెళితే రోడ్డు మీద దొరికే జ్యూస్ షాపులు, చెరకు రసాలు, మజ్జిగ షాపుల వద్దకు వెళ్లి కాస్త ఎక్కువ కూలింగ్ ఉండాలని చెప్పి ఆ పానీయాలను తాగుతాం. ఇంటికి వెళ్లిన తర్వాత గొంతులో నొప్పి వస్తుంది. ఏం అయిందని ఎవరైనా అడిగితే ఫలానా షాపులో జ్యూస్ తాగిన దగ్గరి నుంచి గొంతు బొంగురు పోయింది, దగ్గు వస్తుందని చెబుతాం. దీని అంతటికీ ఓ కారణం ఉంది. అదే పరిశుభ్రత లేని చల్లని పానీయాలతో పాటు ఐస్ కలిపినవి తీసుకోవడమే. దీంతో గొంతు ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని సీనియర్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాజారావు చెబుతున్నారు. ఐస్‌ను ఎలా పడితే అలా నిల్వ చేయడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని తెలిపారు.
ఇంటి నుంచే తీసుకెళ్లడం ఉత్తమం : వేసవిలో చెమట ఎక్కువగా బయటకు పోతుంది. ఇలా కోల్పోయిన నీటిని తిరిగి మళ్లీ భర్తీ చేసేందుకు ఇంటి నుంచి వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్లడమే ఉత్తమం. అలా కాకుండా శుభ్రత లేని చల్లని పానీయాలు, ఐస్ వాటర్, రోడ్లు పక్కన విక్రయించే పండ్ల రసాలు లాంటివి తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. బయట శుభ్రంలేని చోట నీళ్లు తాగడం మంచిది కాదు. పూర్తి చల్లగా కంటే సాధారణంగా ఉన్న పానీయాలనే ఎక్కువగా తీసుకోవాలి.
ఐస్ తయారీ తర్వాత వాటి తరలింపు, నిల్వ విషయంలో జాగ్రత్తలను వారు తీసుకోరు. ట్రాలీలు, ఆటోల్లో తరలించి డ్రమ్ముల్లో నిల్వ చేసి పానీయాల్లో కలుపుతుంటారు. నిమ్మరసం, చెరుకురసం ఇతర పండ్ల రసాల్లో చల్లదనం కోసం ఐస్‌ను చేర్చుతారు. ఈ కారణంగా రకరకాల వ్యాధులు సోకే ప్రమాదం సైతం ఉందని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
వేసవిలో ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకూడదు. ఐస్ కలిపిన జూస్లు తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. ప్రస్తుతం ఈ తరహా సమస్యలతో చాలామంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. ఇంటి నుంచే వాటర్ బాటిల్, మజ్జిగ, నిమ్మరసం లాంటివి పట్టుకొని వెళ్లడం ఉత్తమం.
చిన్నపిల్లలు, వృద్ధులు అదే పనిగా బాగా చల్లని ద్రవాలు, పదార్థాలు తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ వ్యాధులకు గురవుతారు. సరైన ఐస్ ఉపయోగించక పోవడం ఒక కారణమైతే, వీటిని అమ్మేవారు శుభ్రత పాటించకపోవడం, రోడ్లపై ఉండే దుమ్ము, ధూళి పడటం కూడా వ్యాధులకు ఒక కారణం.
ఆస్తమా, బ్రాంకైటీస్, సైనెస్ సమస్యలున్న బాధితులు మరింత అప్రమత్తంగా ఉంటే మంచిది. బాగా చల్లగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోని ట్యూబ్‌లు మూసుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. దీంతో నిద్ర పట్టకపోవడం, నిర్లక్ష్యం చేస్తే న్యూమోనియా కింద మారుతుంది. వీరంతా చల్లని పదార్థాలకు దూరంగా ఉంటేనే మంచిది.
కూలర్ల ద్వారా వచ్చే తుంపర్లలో సన్నని ధూళి కణాలు ఉంటాయి. ఇవి ముక్కు, ఊపిరితిత్తులు, గొంతుల్లోకి వెళ్లి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. కూలర్లలో స్పాంజ్లు ఎప్పటికప్పుడు మార్చాలి. ఏసీల్లో ఫిల్టర్లను శుభ్రం చేయాలి. లేదంటే మార్చుకోవడం ఉత్తమం.
తొలుత గొంతు నొప్పితో సమస్య ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత గొంతు బొంగురుపోవడం, దగ్గు, జలుబుతో పాటు తీవ్రమైన జ్వరం వస్తుంది.