By Poll Result: అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు విడుదల.. ఈ స్థానాల్లో ఇండియా కూటమిదే హవా..

www.mannamweb.com


దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇండియా కూటమి హవా స్పష్టంగా కనిపిస్తోంది. 13 అసెంబ్లీ స్థానాల్లో 11చోట్ల ఇండియా కూటమి ముందంజలో ఉంది. రెండు చోట మాత్రం ఎన్డీయే అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఇప్పటికే పంజాబ్‌ జలంధర్‌లో 37వేల 325 ఓట్ల తేడాతో ఆప్‌ అభ్యర్థి విజయం సాధించారు. జలంధర్‌లో ఆమ్‌ఆద్మీ అభ్యర్థి 37,325 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించడంతో, ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇక బెంగాల్‌, హిమాచల్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తరాఖండ్‌లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. బెంగాల్‌లో ఉపఎన్నికలు జరిగిన 4 స్థానాల్లోనూ టీఎంసీ ముందంజలో ఉండటం గమనార్హం. అలాగే హిమాచల్‌ ప్రదేశ్‎లో 3, మధ్యప్రదేశ్‌‎లో 1, జార్ఖండ్‌‎లో 2 స్థానాల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. ఒక్క బిహార్‌లో మాత్రమే ఎన్డీఏ కూటమి పార్టీ జేడీయూకి స్వల్ప ఆధిక్యం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడులో ఒక్క స్థానంలో ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ జోరు మీద ఉంది. దెహ్రా అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్ భార్య కమలేష్‌ ఠాకూర్‌ అసెంబ్లీ సీటులో ఎనిమిదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఈ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నిక జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, హిమాచల్‌ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బిహార్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడులో ఒక్కో స్థానానికి జరిగిన బై పోల్‌ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలలోపు విడుదలవుతాయి. వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందగా, మరికొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో ఉప ఎన్నికలు నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమ్లేష్‌ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది తొలిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారా? లేక ఇండియా కూటమి అభ్యర్థులు జయకేతనం ఎగురవేస్తారా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ వచ్చిన ట్రెండ్స్ లో ఇండియా కూటమి ముందంజలో దూసుకుపోతోంది.