క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో బీటెక్‌ విద్యార్థి మృతి

గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదులుతున్న చిన్న వయస్కుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.


రాష్ట్రంలో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి శుక్రవారం క్రికెట్‌ ఆడుతూ గుండెనొప్పితో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సీఎంఆర్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్‌ తమ కళాశాల మైదానంలోనే మరణించాడు.

కళాశాల విద్యార్థుల కథనం ప్రకారం.. వినయ్‌, ఇతర స్నేహితులు శుక్రవారం సాయంత్రం కళాశాల మైదానంలో క్రికెట్‌ ఆడారు. ఏమైందో తెలియదు కానీ.. ఆటలో భాగంగా ఫీల్డింగ్‌ చేస్తున్న వినయ్‌.. ఛాతీలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు, స్నేహితులు వినయ్‌ను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ, వినయ్‌ అప్పటికే మరణించాడని అక్కడి వైద్యులు నిర్ధారించారు.