Banking News: ఇకపై వారానికి 5 రోజులే బ్యాంక్స్ వర్కింగ్.. పూర్తి వివరాలివే..

Banks 5 Days Working: దేశంలోని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా వారానికి 5 రోజులు పనిదినాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవుగా ఉండగా..


ఐటీ ఉద్యోగుల మాదిరిగా వారాంతంలో రెండు సెలవురోజులు కావాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

చాలా కాలంగా పెండింగ్ ఉన్న బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ ఈ ఏడాది చివరి నాటికి నెరవేరే అవకాశం ఉందని తెలుస్తోంది. వారానికి రెండు రోజుల పాటు సెలవుకు సంబంధించి ఇండియన్​ బ్యాంక్స్ అసోసియేషన్- ఉద్యోగుల సంఘాల మధ్య ఇప్పటికే ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి కేంద్రంలో కొత్తగా ఏర్పడిన మోదీ సర్కార్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ ఫైల్ ఏడాది చివరి నాటికి ఆమోదం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 మార్చి 8న ఆల్​ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్​ కాన్ఫెడరేషన్​తో పాటు, ఐబీఏ, బ్యాంకు యూనియన్​లు 9వ జాయింట్​ నోట్ పై సంతకాలు చేశాయి.

కేంద్రం ఆమోదం లభిస్తే ఈ ఏడాది డిసెంబర్ నుంచి బ్యాంకులు సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే వారంలో కేవలం 5 రోజుల పాటు పనిచేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది డిసెంబర్​ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులతో సహా ఇండియన్ బ్యాంక్స్​ అసోసియేషన్, బ్యాంక్ యూనియన్​ల మధ్య ఒక అవగాహన ఒప్పందం కొన్ని షరతులతో కుదిరిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం పనిగంటల పెంపుతో పాటు, ఖాతాదారులకు సేవల్లో అంతరాయాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించబడింది.

ఒకవేళ ప్రస్తుతం జరిగిన అంగీకారం ప్రకారం బ్యాంకులు రానున్న కాలంలో వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పనిచేసినట్లయితే బ్యాంకింగ్ సమయాల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. దీని ప్రకారం బ్యాంకులు ఉదయం 9.45న తెరుచుకుని సాయంత్రం 5.30 వరకు ఖాతాదారులకు సేవలు అందించనున్నాయి.