ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాచవరంలో ఉన్న సరస్వతి పవర్ అసైన్డ్ భూములు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిర్ణయం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ కుటుంబానికి చెందిన ఆస్తులపై ఇటీవల వివాదాలు చెలరేగాయి.
జగన్, ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ మధ్య కోర్టుకు వెళ్లిన ఆస్తుల వివాదం ఈ పరిణామాలకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు, మాచవరంలో ఉన్న భూములపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రికార్డులు పరిశీలించిన అనంతరం అసైన్డ్ భూములు అక్రమంగా ఉండటం స్పష్టమైనట్లు అధికారులు నివేదిక సమర్పించారు.
మాచవరంలోని 17.69 ఎకరాల భూములపై అధికారుల సమీక్ష కీలకంగా మారింది. ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులు, సర్వే నివేదికల ఆధారంగా భూముల అప్‌డేట్ ఇచ్చిన అధికారులు, భూములను ప్రభుత్వ కస్టడీలోకి తీసుకోవాలని సూచించారు. ఆ సిఫారసుల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ పరిణామాలు వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆస్తుల వివాదం, కోర్టు కేసులు జగన్ కుటుంబంపై ఆర్థిక, రాజకీయ ప్రభావం చూపుతున్నాయి. ఇక ఈ తాజా నిర్ణయం ప్రభుత్వం మరియు వైఎస్ కుటుంబం మధ్య మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.