మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భావం అయింది. లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు అయింది.
రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ పురుడుపోసుకుంది. గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కొత్త పార్టీని విజయ్ కుమార్ ప్రకటించారు. అధిక జన మహా సంకల్పం పేరుతో సభ ఏర్పాటు చేసి పార్టీ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు విజయ్ కుమార్ వివరించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోతోందని తెలిపారు. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేస్తామని స్పష్టం చేశారు. అధిక జనుల ఐక్యతే లక్ష్యమని, తమతో కలిసి వచ్చే నాయకులతో కలిసి ఎన్నికలకు వెళ్తామని విజయ్ కుమార్ పేర్కొన్నారు.
కాగా రిటైర్ట్ ఐఏఎస్ విజయ్ కుమార్ తెలుగు ప్రజలకు సుపరిచితమే.. ఆయన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల్లో పలు కీలక శాఖల్లో పని చేశారు. రిటైర్డ్ అయిన తర్వాత విజయ్ కుమార్ వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అంతేకాదు సీఎం జగన్‌తో కూడా చర్చలు జరిగినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.చివరకు విజయ్ కుమార్ సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు.