BREAKING: రిపబ్లిక్ డే వేడుకల్లో గత BRS ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సంచలన వ్యాఖ్యలు..!

www.mannamweb.com


గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని..
ఈ పదేళ్లలో రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసానికి గురయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దె దింపారన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్ధిక స్థితి దిగజారిపోయిందని విమర్శించారు.

నియంతృత్వ ధోరణిని తెలంగాణ ప్రజలు సహించలేదని.. గత ప్రభుత్వ పదేళ్ల నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారన్నారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారని.. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందని.. విధ్వంసానికి గురైన వ్యవస్థలను పునర్మించుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ఆక్షాంకల మేరకు కొత్త ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు.

గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదని విమర్శించారు. ప్రజలకు కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని.. పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉందన్నారు. మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. సచివాలయంలో సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.