Bus conductor: ఏడు అడుగుల కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ గిఫ్ట్!

తన ఎత్తు కారణంగా ఆర్టీసీ బస్సులో కండక్టర్ పని చేయడానికి ఇబ్బంది పడుతున్న అమీన్ అహ్మద్ అన్సారీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.


చాంద్రాయణగుట్ట షాహీనగర్లో నివసిస్తున్న అహ్మద్ అన్సారీ మెహిదీపట్నం డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన అమీన్ అహ్మద్ తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో మరణించగా, కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తి చేసిన అన్సారీకి మెహిదీపట్నం ఆర్టీసీ డిపోలో కండక్టర్ ఉద్యోగం లభించింది.

అయితే అతని ఎత్తు కారణంగా డ్యూటీలో ఇబ్బందులు ఎదుర్కొంటూ, మెడ, వెన్ను నొప్పులు, నిద్రలేమి సమస్యలతో ఆసుపత్రులు చుట్టూ తిరగాల్సి వస్తోంది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10 గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అహ్మద్ అన్సారీ విచారం వ్యక్తం చేశారు. అయితే అహ్మద్ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం
ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడమైనదని.. అతనికి ఆర్టీసీలోనే వేరే ఉద్యోగం ఇవ్వడానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచనలు ఇవ్వడమైనదని తెలిపారు. త్వరలోనే సజ్జనార్ అహ్మద్ అన్సారీని వేరే శాఖకు బదిలీ చేస్తారని మంత్రి పొన్నం ప్రకటించారు.