Success Story: చాలా మందిలో తమ చుట్టూ చూస్తున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచన ఉంటుంది. ప్రధానంగా పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలనిపిస్తుంది. అయితే దానిని ఆచరణలో పెట్టే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గౌరీ గోపీనాథ్-కృష్ణన్ సుబ్రమణియన్ గురించే దంపతుల వ్యాపార విజయం గురించే. ఒకప్పుడు వీరిద్దరూ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసేవారు. అయితే వీరిద్దరికీ ఎల్లప్పుడూ వారి స్వగ్రామం మధురైకి వెళ్లి సెటిల్ అవ్వాలని ఉండేది. అయితే తాము పుట్టిపెరిగిన నగరంలో విచ్చలవిరిగా పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగం, వ్యర్థాలను తగ్గించాలనే ఆలోచన వారిలో కలిగింది. ముఖ్యంగా తక్కువ నాణ్యత కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్ని ఎలాగైనా ఆపాలని వారు నిర్ణయించుకున్నారు.
పర్యావరణానికి జరిగే ప్రమాదాన్ని అరికట్టి, ప్లాస్టిక్ వాడకం నుంచి పర్యావరణ అనుకూల పద్ధతికి మారాలని ఈ దంపతుల్లో ఎల్లప్పుడూ ఉండేది. ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఈ జంట 2014లో ముందడుగు వేసింది. వీరు ఎల్లోప్యాక్ అనే బ్యాగుల తయారీ కంపెనీని ప్రారంభించారు. మొదట్లో తమ స్నేహితులకు విషయం చెప్పి గుడ్డ బ్యాగులు వాడాలని వారికి, వారి కుటుంబాలకు సూచించారు. బ్యాగుల తయారీకి స్థానిక టైలర్లను నియమించుకోవడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను వారు ఎదుర్కొన్నారు. అలా 2019లో తమ ఉద్యోగాలను వీడి.. పూర్తి స్థాయిలో వ్యాపారంలో నిమగ్నమయ్యారు. ఈ సంచులు పర్యావరణ అనుకూలమైనవి. జనపనార, పత్తి మిశ్రమంతో తయారు చేయబడిన ఈ బ్యాగ్ వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. తర్వాతి కాలంలో ప్యాకేజింగ్ బ్యాగులు, గార్మెంట్ బ్యాగులు, హ్యాంగ్ బ్యాగులు ఇలా రకరకాల బ్యాగులను తయారు చేశారు. రూ.20 నుంచి రూ.200 వరకు ధరలకు విక్రయించారు. తమ ఉత్పత్తులను విక్రయించేందుకు వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ బ్యాగ్‌లను మార్కెట్ చేశారు. తమ ఆఫీసులో కూడా అమ్మేశారు. రోజూ 2000 నుంచి 3000 బ్యాక్స్ కుట్టడంతో ఈ ఏడాది వారు రూ.3 కోట్లను ఆర్జించారు. ప్రస్తుతం వీరు తయారు చేస్తున్న బ్యాక్స్ వివిధ వస్త్ర దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు పెద్దఎత్తున వినియోగిస్తున్నాయి.