రైల్వే ఉద్యోగులకు భారత ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి సందర్భంగా ఉద్యోగులు అందరికీ బోనస్ ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం..
78 రోజుల శాలరీకి సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను అందించడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ బోనస్ మొత్తం రూ.2028.57 కోట్లతో 11,72,240 మంది రైల్వే ఉద్యోగులకు ప్రయోజనం అందించనుంది. ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రోత్సహించడానికి ఈ బోనస్ నిర్ణయం తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
రైల్వేలో పని చేసే వివిధ కేటగిరీల ఉద్యోగులు ఈ బోనస్ అందుకుంటారు. రైలు పట్టాలను మరమ్మతు చేసేవారు (Track maintainers), లోకో పైలట్స్ (Loco pilots), రైలులో ప్రయాణికులను చూసుకునే ట్రైన్ మేనేజర్స్, గార్డ్స్, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్లు, హెల్పర్లు, సిగ్నల్స్‌ను నియంత్రించే సిబ్బంది, క్లర్కులు లాంటి ఆఫీస్ స్టాఫ్ ఇలా అందరికీ బోనస్ వస్తుంది. ప్రతి ఏడాది దసరా పండుగకు ముందు రైల్వేలో పని చేసే చాలా మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా బోనస్ ఇస్తారు. దీనినే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అని అంటారు. అయితే పరిమితుల కారణంగా, అర్హత ఉన్న ఉద్యోగికి బోనస్ గరిష్టంగా రూ.17,951 మాత్రమే అందుతుంది.
గతేడాది రికార్డ్స్ బ్రేక్
గత సంవత్సరం రైల్వే సంస్థకు బాగా లాభాలు వచ్చాయి. ఇండియన్ ట్రైన్లు అద్భుతంగా నడుస్తూ అన్ని విధాలా దేశానికి అండగా నిలిచాయి. రైళ్ల ద్వారా 158.8 కోట్లు లేదా 1588 మిలియన్ టన్నుల సరుకును ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లారు. ఇంత సరుకును ఒకే సంవత్సరంలో రవాణా చేయడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా, దాదాపు 670 కోట్ల మంది ప్రయాణికులను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లారు. ఇది కూడా చాలా పెద్ద సంఖ్య. రైల్వేలను మరింత బాగా డెవలప్ చేయడానికి ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసింది. దీంతో రైళ్లు మరింత వేగంగా, సురక్షితంగా నడిచాయి. ఇందుకు కొత్త యంత్రాలను, సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడం మొదలుపెట్టారు.
ఉద్యోగుల్లో నిరాశ
అయితే రైల్వే ఉద్యోగ సంఘాలు మాత్రం, తమకు ప్రభుత్వం మరింత బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల జీతాల ఆధారంగా కాకుండా, ఏడో వేతన సంఘం జీతాల ఆధారంగా బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారిని నిరాశపరిచింది.
రైల్వే ఉద్యోగులకు ఇప్పుడు కనీస జీతం రూ.18,000. కానీ, బోనస్ మొత్తాన్ని రూ.7,000 జీతం ఆధారంగా లెక్కించారు. అంటే, ఉద్యోగులకు వచ్చే జీతం పెరిగినా, బోనస్ మాత్రం పెరగలేదు. అందుకే బోనస్ రూ.46,159 ఉండాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం 20,000 లోపే బోనస్ అందిస్తోంది.