పందెం కోడి అంటేనే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది. సంక్రాంతి పండగకు ప్రత్యేకంగా కోడళ్లను తయారు చేస్తూ ఉంటారు. వీటికి ఖరీదైన ఆహారం పెడుతూ పెంచతారు.
ఈ కోళ్లు కూడా చాలా రేటు పలుకుతాయి. పందెం కోడి రుచి ఇతర కోళ్ల రుచులకు రాదు. పందెం కోళ్లకు రుచి కూడా ఎక్కువే. ఈ కూరకు మసాలా పెట్టి వండితే.. ఆహా అంటారు. సాధారణ చికెన్ వండినట్టు ఈ కోళ్లను వండకూడదు. పందెం కోడి మాంసాన్ని ప్రత్యేకంగా వండాలి. దీనికి ఉండే రుచే వేరు. మరి పందెం కోడిని ఎలా వండుతారు? ఈ మాంసం వండటానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పందెం కోడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
పందెం కోడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, షాజీరా, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఆయిల్.
పందెం కోడి తయారీ విధానం:
ఈ కూర వండటానికి ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో షాజీరా, జీలకర్ర, జీడిపప్పు, గసగసాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొత్తిమీర నీళ్లు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకులు వేసి వేగాక.. షాజీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పందెం కోడిని శుభ్రంగా క్లీన్ చేసుకుని.. ఉల్లిపాయల మిశ్రమంలో వేసుకోవాలి.
మాంసాన్ని బాగా మగ్గించాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ పది నిమిషాలు ఉడికించాలి. ఇది బాగా వేగాక.. ముందుగా మిక్సీ చేసి పెట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఇవి కూడా ఓ పది నిమిషాలు వేగాక.. అంతా కలిపి వాటర్ వేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతకు విజిల్స్ పెట్టి.. 10 లేదా 11 విజిల్స్ అయినా తెప్పించాలి. అనంతరం ఆవిరి పోయాక.. మూత తీసి.. మళ్లీ ఒకసారి రుచి చూసుకుని ఏమన్నా తక్కువ అయితే వేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పందెం కోడి సిద్ధం.