సీఐడీ అంటే పెద్ద పెద్ద కేసులు, కుంభకోణాలు, అవినీత వ్యక్తులను విచారించే సంస్థగా మంచి గుర్తింపు ఉంది. కానీ, ఓ రాష్ట్రంలో సమోసాలు మిస్సింగ్ అయ్యాయని ఏకంగా సీఐడీ రంగంలోకి దిగింది. ఇందులో విచిత్రం ఏంటంటే.. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఈ విచారణకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఈ వింత ఘటన ఎక్కడో కాదు మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 2024లో హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో భాగంగా సీఎంకు వడ్డించాల్సిన సమోసాలు కనిపించకుండా పోయాయి. ఆ సమోసాలు ఏం అయ్యాయని ఏకంగా ఆ రాష్ట్ర సీఐడీ విచారణకు దిగింది. ఏంటీ.. ఆఫ్ట్రాల్ సమోసాల కోసం సీఐడీ విచారణ చేస్తుందా? అవేమన్నా బంగారంతో చేసినవా? అని అనుకోకండి.
అవి అందరూ తినే సాధారణ సమోసాలే, వాటిలో ఎలాంటి స్పెషల్ లేదు. కానీ, సీఎం హాజరైన కార్యక్రమంలో అవి మిస్ కావడం, పైగా ఆ కార్యక్రమం సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌లోనే జరగడంతో వచ్చింది అసలు సమస్య. తమ ఆఫీస్‌లో, సీఎం పాల్గొన్న ఈవెంట్‌లో సమోసాలు ఎలా మిస్ అవుతాయంటూ సీఐడీ అధికారులు గరం గరం అయ్యారు. లేదు లేదు అసలు అవి ఎలా మిస్ అయ్యాయి? ఎవరు వాటిని దొంగిలించారు? అనే విచారించుకోవాల్సిందే అని సీఐడీ వాళ్లు అనుకున్నారు. అయితే ఈ విషయం ఎలాగో బయటికి పొక్కింది. సమోసాల కోసం సీఐడీ విచారణ జరుపుతోందహో అంటూ రాష్ట్ర మీడియా, సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరిగింది.
సమోసాల కోసం సీఐడీ విచారణ చేయడం ఏంటీ చీపుగా, ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు, రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయి, డ్రగ్స్‌కు యువత బలవుతోంది.. ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు వదిలేసి సమోసాల వెనుకపడతారా? మీకు బుద్ధిలేదా అంటూ సీఐడీపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే సీఐడీని సమోసాల గురించి విచారించమని సీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు అందాయనే వార్తలు రావడంతో ప్రతిపక్ష బీజేపీ నేతలు ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సమోసాల సంగతి అంటు ఉంచండి.. అసలు ఈ విషయం బయటి ఎలా పొక్కింది? ఎవరో కావాలనే ఈ విషయాన్ని లీక్ చేశారంటూ సీఐడీ అధికారులు సీరియస్ అయ్యారు.
సీఐడీ అంతర్గత వ్యవహారాన్ని చట్టవ్యతిరేకంగా ఎలాంటి అనుమతి లేకుండా ఎలా లీక్ చేస్తారంటూ తాజాగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సీఐడీలో అంతర్గతగా జరుగుతున్న ఓ వ్యవహారం బయటికి ఎలా లీక్ అవుతుంది, ఇది సీఐడీతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం అంటూ ఎస్పీ సీఐడీ రాజేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అయితే తాము సమోసాల మిస్సింగ్‌పై రాతపూర్వకంగా ఎలాంటి కేసు నమోదు చేయలేదని, ఇది కేవలం సీఐడీ అంతర్గత వ్యవహారం అని సీఐడీ అధికారులు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా దీనిపై ఒక ప్రకటన వచ్చింది. సమోసాల మిస్సింగ్‌పై విచారణ జరపమని సీఎం ఆఫీస్ నుంచి ఎవరికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అది కేవలం సీఐడీ ఇంటర్నల్ మ్యాటర్ అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.