CM Revanth Comments On Jagan: జగన్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!

CM Revanth Comments On Jagan: తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు (CM Revanth Comments On Jagan) చేశారు.


ఏపీలో టీడీపీని ఖతం చేయాలనుకుని.. జగనే ఖతమయ్యారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలనను విస్మరించినందుకే జగన్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది. చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్‌లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం అని ఆయన వెల్లడించారు.

అంతేకాకుండా వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం చచ్చిన పాములాంటి వాడని అన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ఈ మేరకు మాజీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారని గుర్తుచేశారు. దీనికి కారణం జగన్ ఆచరించిన పనులే అని సీఎం రేవంత్ చెప్పారు. వైసీపీ ఎంపీలు తనను కలిస్తే వారిని జగన్‌ తిట్టిన సందర్భాలున్నాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ తెలిపారు. జగన్ చేసిన పనులు నచ్చకనే ఏపీ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీపై రేవంత్ స్పందన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. టీడీపీ 10% ఓట్లు దక్కించుకునేదని, అప్పుడు కచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ అహంకారం, అతి తెలివితేటల వల్ల దెబ్బతిన్నారని చెప్పారు. తాను సీఎం కావడం, బీఆర్ఎస్‌ ఓటమి, కేసీఆర్‌ను గద్దెదించడమనే తన మూడు రాజకీయ లక్ష్యాలు నెరవేరాయన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని తెలిపారు.